దేవరకొండ, నవంబర్ 25 : కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకు వివరించి, స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గుడిపల్లి మండలం జి భీమనపల్లి గ్రామానికి చెందిన సుమారు 20 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీని వీడి రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గానికి లాభం చేకూరలేదన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. అదే విధంగా 420 హామీ కార్డులను ప్రతి ఇంటికి పంచాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో కుంభంపాటి శ్రీను, సింగం వెంకటయ్య, సైదిరెడ్డి, బిల్డి కొటేష్, అంజి, లింగస్వామి, జి శివ, రంగయ్య కోటేశ్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వల్లపు రెడ్డి, పరమేశ్, శ్రీను, రాజేందర్ పాల్గొన్నారు.