అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఏడాది దాటినా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదింటి ఆడబిడ్డల పెండ్లికి లక్షా నూట పదహార్లు అందించి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలవగా, తమకు అధికారం ఇస్తే అందుకు అదనంగా తులం బంగారం ఇస్తామన్న రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఆ మాట కూడా ఎత్తడం లేదు. పెండ్లికి ముందే లగ్నపత్రిక చూయించి దరఖాస్తు చేసుకుంటే కల్యాణలక్ష్మి నగదు సాయంతోపాటు తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేయడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఏడాది కాలంలో సూర్యాపేట జిల్లాలో 5,520 వరకు వివాహాలు జరుగగా 3,362 మందికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినట్టే కల్యాణలక్ష్మి నగదును అందించారు. ఇందిరమ్మ కానుకగా ఇస్తామన్న బంగారం మాత్రం మరిచారు. ఇలా ఇప్పటివరకూ జిల్లాలో 33.62 కిలోల బంగారం సర్కారు బాకీ పడింది.
ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు, అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటి అమలులో మాత్రం చిత్తశుద్ధి చూపించడం లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని వర్గాల బాధలను చూసి చలించిన ఉద్యమ రధసారథి కేసీఆర్.. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాక జనం అడగకున్నా వారి అవసరాలు తెలుసుకుని అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారు. అందులో ఒకటి కల్యాణలక్ష్మి, షాదీముబారక్. పేదింటి ఆడబిడ్డల పెండ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో సర్కారు నుంచి రూ.లక్షా ఒక వేయి నూటపదహారు రూపాయలు అందిస్తూ వచ్చారు. అలా అనేక కుటుంబాలను అప్పుల గండం దాటించారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు పెండ్లికి ముందే తులం బంగారం అదనంగా ఇస్తామని ఊదరగొట్టింది. కానీ, అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా నేటికీ ఆ పథకం ఊసే ఎత్తడం లేదు. 2024 జనవరి నుంచి ఇప్పటివరకు సూర్యాపేట జిల్లాలో దాదాపు 5,520 వివాహాలు జరిగాయి. అందులో 3,362 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వారికి కేసీఆర్ హయాంలోనే ఇచ్చినట్టు లక్షా నూట పదహార్ల చెక్కు మాత్రమే ఇచ్చారు తప్ప బంగారం ఇవ్వలేదు. అలా ఒక్క సూర్యాపేట జిల్లాకే కాంగ్రెస్ ప్రభుత్వం 33.62 కిలోల బంగారం బాకీ పడింది. మరోవైపు మిగిలిన దరఖాస్తుదారులకు రావాల్సిన నగదు కూడా ఇంకా పెండింగ్ లోనే ఉంది. సర్కారు మోసపూరిత వైఖరిపై మండిపడుతున్న లబ్ధిదారులు ఎన్నికల హామీ మేరకు తులం బంగారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
నా బిడ్డ పెండ్లి చేసి సంవత్సరం అయ్యింది. ఇంతవరకు తులం బంగారం ఇవ్వలేదు. కల్యాణలక్ష్మి చెక్కు కూడా రాలేదు. పెండ్లి కోసమని చేసిన అప్పులకు వడ్డీ పెరుగుతున్నది. ప్రభుత్వం తులం బంగారం ఇస్తే అదనంగా ఇంకో తులం ఇస్తమని మా అల్లుడికి మాట ఇచ్చినం. ఏడాదైనా రాకపాయె. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుని మాలాంటి పేదోళ్లను ఆదుకోవాలి.