కొండమల్లేపల్లి, సెప్టెంబర్ 01 : కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకు అప్పగిండాన్ని తీవ్రంగా నిరసిస్తూ పార్టీ శ్రేణులతో కలిసి కొండమల్లేపల్లి మండల కేంద్రంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను శాశ్వతంగా మూసేసి, నదీ జలాలను ఆంధ్రాకు తరలించేందుకు సీఎం రేవంత్ కుట్ర ఇదన్నారు. సీబీఐకి కాళేశ్వరం అప్పజెప్పడం అంటే ప్రాజెక్ట్‌ను పూర్తిగా మూసేయడమే అన్నారు. నిన్నటిదాకా సీబీఐ పైన వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చినట్లు ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న శక్తులు, వాటి ఉద్దేశాలేమిటో ప్రజలకు తెలుపాలని డిమాండ్ చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేస్తున్న ఈ కుట్రలను ఎదుర్కోవాలన్నారు. ఇది కేసీఆర్ పైన చేస్తున్న కుట్ర మాత్రమే కాదన్నారు. తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి, కాళేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగానే జరుగుతున్నదన్నారు. ఇది కచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్న నాటకం, వాళ్లు చేస్తున్న కుట్రే అని తెలిపారు. కేంద్రంతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ఎదుర్కొంటామన్నారు. ఓటుకు నోటు దొంగలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, బీజేపీ డైరెక్షన్లో కేసీఆర్‌పై కుట్ర చేస్తున్నట్లు దుయ్యబట్టారు. కాళేశ్వరంపై ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. కేసీఆర్ పై విచారణ అంటేనే తెలంగాణ రైతాంగాన్ని అవమానించినట్లే అన్నారు.
బడే భాయ్.. చోటే భాయ్ లు కలిసి కేసీఆర్‌ను తట్టుకోలేక కుట్రలు పన్నుతున్నారన్నారు. తెలంగాణ కోసం చావు నోట్లో తలపెట్టి పోరాడిన కేసీఆర్ పై కుట్రలు చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. కమిషన్ నివేదికపై మాట్లాడేందుకు సమయం ఇవ్వకుండా ప్రభుత్వం గొంతు నొక్కిందన్నారు. తెలంగాణ కోసం ఏనాడు జైలుకు వెళ్లని వ్యక్తి, జై తెలంగాణ నినాదం చేయని వ్యక్తి, తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలంతా గమనిస్తున్నారని, ప్రజాక్షేత్రంలో రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు, యువజన విభాగం నాయకులు, విద్యార్ది విభాగం నాయకులు పాల్గొన్నారు.
Konda Mallepally : కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్ర : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్