రైస్ మిల్లర్లతో నల్లగొండ కాంగ్రెస్ పెద్దలు కుమ్మక్కై అన్నదాతలను నిలువునా ముంచుతున్నారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే రైస్ మిల్లర్లతో సమావేశమైన మరుసటి రోజే సన్నవడ్ల ధర రూ.300 తగ్గించడం ఏమిటో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఎక్కడైనా సమీక్ష నిర్వహిస్తే రైతుల పక్షాన ధాన్యం ధర పెరగాలి తప్ప తగ్గడం కాంగ్రెస్ పాలనలోనే చూస్తున్నామని ఎద్దేవా చేశారు. రైతుల సమస్యలకు పరిష్కారం చూపకపోతే బీఆర్ఎస్ తరఫున ప్రభుత్వంతో పోరాడుతామన్నారు. ఇప్పటికే రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలన పూర్తయిందని, ఇక బీఆర్ఎస్ కార్యకర్తలు గట్టిగా కొట్లాడాల్సిన సమ యం ఆసన్నమైందని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మళ్లీ కేసీఆర్ వస్తాడనేది… కాంగ్రెస్ వాళ్లకి కూడా స్పష్టమైందన్నారు. కాంగ్రెసోళ్లు… దోచుకోవడం.. దాచుకోవడంపైనే దృష్టి పెట్టారని మడ్డిపడ్డారు.
నల్లగొండ ప్రతినిధి/హాలియా, ఏప్రిల్19 (నమస్తే తెలంగాణ): సార్…బస్తాకు రెండు కేజీల తరుగు తీస్తున్నరు…వడ్లు అమ్ముకునేటందుకు ఎండల్లో శర తీస్తు న్నం…నిలువ నీడ లేక వేడినీళ్లు తాగుతూ పొద్దంతా వడ్ల కుప్పల కాన్నే ఉంటు న్నం. ఎప్పుడు కాంట ఏస్తరో తెలుస్తలేదు. కాంట ఏస్తే క్వింటాల్‌కు ఐదారు కిలోల తరగు తీస్తుర్రు. అప్పుడేమో యూరియా దొరక్క ఇబ్బందులు పడ్డం. లైన్లలో నిలబడి దెబ్బలు తగిలిచ్చుకున్నం. ఇగ రుణమాఫీ కాలే. రెండు లక్షల పైన ఉన్న అప్పు కట్టమంటే కట్టినం. అయినా మాఫీ కాలే. రైతుబంధు కూడా ఇప్పటికీ ఎకరానికే పడ్డది.మధ్యలో అది కూడా రాలే.
ఇట్ల రైతులం మస్తు ఇబ్బందులు పడుతు న్నం…మీరే పట్టించుకోవాలి సారూ…అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీశ్‌రావు ఎదుట రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. ఆదివారం గుర్రంపోడు మండలంలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశానికి హరీశ్‌రావు హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి కొండమల్లేపల్లి మీదుగా హరీశ్‌రావు గుర్రంపోడు వస్తున్న విషయం తెలుసుకున్న తానేదార్‌పల్లిలో రైతులు పెద్ద సంఖ్యలో గుమికూడారు. దీంతో హరీశ్‌రావు అక్కడ ఆగి పక్కనే ఉన్న వడ్ల కొనుగోలు కేంద్రంలోకి వెళ్లారు. ఎండబోసిన వడ్లను పరిశీలిస్తూ రైతులతో మాట్లాడారు.
కుర్చీపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు..
సీఎం,మంత్రులు ఢిల్లీకి చక్కర్లు కొడుతూ రైతులను గాలికి వదిలేసారని, వారికి కుర్చీలపై ఉన్నశ్రద్ధ రైతులపై లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. పదవులు నిలుపుకోవడం కోసం ఢిల్లీకి కప్పం కట్టడంపైనే సీఎం, మంత్రుల దృష్టి సారించారన్నారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి, మంత్రులు గాలిమోటార్లు వదిలి భూమి మీదికి వచ్చి రైతుల బాధలు పట్టించుకోవాలని హితవు పలికారు. తరుగు తీస్తున్న రేవంత్‌రెడ్డి తోలు తీసేందుకు రైతులు సిద్ధమవుతున్నారన్నారు. కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం తీరు మారకపోతే రెండుమూడు రోజుల అనంతరం రైతుల పక్షాన బీఆర్ఎస్ ఆందోళనకు సిద్ధమని హెచ్చరించారు.
తానేదార్పల్లి లో వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద మీడియాతో హరీశ్‌రావు మాట్లాడారు. రేవంత్‌రెడ్డి 70 సార్లు ఢిల్లీ వెళ్లాడు కానీ…ఒక్కసారి రైతుల వద్దకు రాలేదన్నారు. సివిల్ సప్లయీస్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి, అయినా ఒక్క రోజైనా ఒక్క కేంద్రాన్నైనా పరిశీలించే తీరిక ఎందుకు లేదన్నారు. రైతులు కష్టపడి పండించిన పంటను ఒక్కో క్వింటా వడ్లకు ఐదు కేజీల తరుగు తీసి దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డీ నీకు..కమీషన్లు, పర్సెంటేజీల లెక్కలు చూసుకోవడానికే టైం సరిపోతోందా…కప్పం కట్టడానికే టైం ఉండడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మిల్లర్లతో మీటింగ్ పెట్టి తరుగు లేకుండా వడ్లను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హరీశ్‌రావు : నీ పేరేంటమ్మా… ఎన్ని రోజులాయే వడ్లు తెచ్చి?
రైతు : నా పేరు వెంకటమ్మ. బస్తాకు రెండు కేజీలు తీస్తున్నరు. ఇది వరకు కేజీ తీసేది.
హరీశ్‌రావు : ఎన్ని బస్తాల వడ్లు అమ్ముతున్నవ్.
రైతు : నాకు రెండొస్తల బస్తాల వడ్లు అయితయ్. ఇంత తరుగు ఎట్ల భరాయించాలి సారూ.
హరీశ్‌రావు : క్వింటాకు రెండు కిలోలా? బస్తాకు రెండు కిలోలా?
రైతు : బస్తాకే రెండు కిలోలు సారూ.. 40 కిలోల బస్తాకు రెండు కిలోలు. క్వింటాకు ఐదు కిలోలు సార్. నాకు మూడు క్వింటాళ్ల దాక తరుగు కిందనే పోతున్నయి సారూ.
హరీశ్‌రావు : తరుగు తీయొద్దు అంటున్నవ్.
రైతు : అవును సార్… తీయొద్దు… మాకు అప్పుడేమో యూరియా బస్తాలు దొరక్క మస్తు ఇబ్బందులు పడ్డం. లైన్లలో నిలబడి దెబ్బలు తగిలిచ్చుకున్నం. కన్న బాధలు పడుతున్నం. రైతులకు ఏం లాభం లేదు సారూ.
హరీశ్‌రావు : ఏం పేరు బాపూ…? రుణమాఫీ అయ్యిందానే?
రైతు : నా పేరు దశరథరెడ్డి. నాకు ఇంతవరకు అర్థరూపాయి కూడా రుణమాఫీ కాలే. రెండు లక్షల వరకే రుణమాఫీ పైన ఉన్న డబ్బులు అప్పు తెచ్చిన కట్టిన వాళ్లు చాలా మంది ఉన్నరు. ఎవరికీ రుణమా ఫీ కాలేదు. ఉచిత బస్సు పెట్టి డబ్బులన్నీ అటే ఇస్తు న్నం అని చెప్పి రైతులకు రుణమాఫీ చేయలేదు.
హరీశ్‌రావు : రైతుబంధు పడ్డదానే పెద్దమనిషి?
రైతు : ఒక్క ఎకరానికే పడ్డది సారు. మిగతావి ఎప్పుడో తెలుస్తలేదు. ఎన్నడూ సక్కగా రైతుబంధు వేయలే.
హరీశ్‌రావు : కాంగ్రెస్ సర్కార్ వచ్చాక నాలుగు సార్లు పడాలి. ఒక్కటే సారి పడ్డది. ఒక్కసారి మొత్తానికి ఎగ్గొట్టిండ్రు. ఒకసారేమో సగమంతే ఇచ్చిండు. ఈ సారి ఒక్క ఎకరానికి ఇచ్చిండు. ఇట్లా రైతుల బాధలు తెలుసుకునేందుకే మీ దగ్గరికి వచ్చానంటూ రైతులకు వివరించి మీ గురించి ప్రభుత్వంపై కొట్లాటకు ఎప్పుడూ సిద్ధమని భరోసా ఇచ్చారు.