గుండాల, మే 9 : బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తగా ఉన్నాడన్న ఉద్దేశంతో గుండాల మండలం పాచిల్ల గ్రామానికి చెందిన పందుల రమేశ్‌కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదు. దళిత కుటుంబానికి చెందిన పందుల రమేశ్ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ తనకు ఉన్న ఖాళీ స్థలంలో సొంతంగా ఇల్లు కట్టుకునే ఆర్థిక స్థోమత లేక ఏండ్ల తరబడి గుడిసెలో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు.. ప్రభుత్వం తరపున ఇల్లు మంజూరు అయితే ఇల్లు కట్టుకుంటా అనుకున్న రమేశ్ ఆశలు కాస్త అడియాశలు అయ్యాయి. రమేశ్ పూరి గుడిసెలో 8 మంది కుటుంబ సభ్యులతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వ ఆదేశాలతో ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కమిటీల సహకారంతో లిస్టును రెడీ చేశారు. దాంతో తనకు కూడా ఇల్లు మంజూరు అయ్యిందేమో అనుకుని రమేశ్ సదరు అధికారులను అడుగగా ఇల్లు మంజూరు కాలేదని చెప్పడంతో రమేశ్ అయోమయంలో పడ్డాడు.
తనకు ఒక్క గుంట కూడా భూమి లేదని, పూరి గుడిసెలో ఏండ్ల తరబడి ఉంటున్నానని, తనకు కాంగ్రెస్ నాయకులు కావాలనే ఉద్దేశపూర్వకంగా లబ్ధిదారుల జాబితాలో చేర్చలేదని రమేశ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్నావని, అందుకే ఇల్లు మంజూరు చేయలేదని పలువురు కాంగ్రెస్ నాయకులు అన్నట్లు రమేశ్ వాపోతున్నాడు. ఇటీవల గుండాల తాసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన భూ భారతి అవగాహన సదస్సులో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, కలెక్టర్ హనుమంతరావుకు వినతి పత్రం ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని తెలిపాడు. తాను భార్య, నలుగురు కుమారులు, కుమార్తెతో పాటు తల్లీతో కలిసి గుడిసెలోనే ఉంటున్నానని, అకాల వర్షాలకు గుడిసె పూర్తిగా దెబ్బతిన్నదని, తనకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని రమేశ్ కోరుతున్నాడు. రమేశ్ నిజమైన లబ్ధిదారుడని, అతనికి ఇల్లు మంజూరు చేయాలని పలువురు గ్రామస్తులు సైతం అధికారులకు గుర్తు చేస్తున్నారు.