యాదగిరిగుట్ట, ఆగస్టు 30: ‘అధికారంలోకి వచ్చాం’ ‘మేం ఏం చెబితే అదే’ ఆలేరు నియోజకవర్గంలోని గుట్ట దేవస్థానంలో మాదే పెత్తనం’ అంటూ ఎమ్మెల్యే అనుచరులు తెగ రెచ్చిపోతున్నారు. ఏ పనికావాలన్నా టాక్స్ చెల్లించాల్సిందేనంటూ నయా దందాకు తెరతీశారు. యాదగిరిగుట్ట దేవస్థానంలోని కల్యాణ కట్టలో తాము కొలువులు పెట్టిస్తామంటూ అధికార పార్టీకి చెందిన పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఇటీవల కొంత మంది నాయీ బ్రాహ్మణుల వద్ద అధిక మొత్తంలో వసూలు చేశారని అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. వసూలు చేసిన మొత్తాన్ని పెద్ద పెద్ద నాయకులు, దేవస్థానంలో క్రియాశీలకంగా వ్యవహరించే ఉన్నతస్థాయి అధికారులు పంచుకున్నట్లు పట్టణం లో జోరుగా ప్రచారం జరుగుతున్నది. దీనిపై సమగ్ర విచారణ జరిపి డబ్బులు దండుకున్న నాయకులు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
పారితోషికంగా 60 శాతం వాటాధనం..
ప్రధాన ఆలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు తొలి సీఎం కేసీఆర్ ఘనంగా పారితోషికం ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలతో పాటు యాదగిరిగుట్ట దేవస్థానంలోని కల్యాణకట్టలో పనిచేసే క్షౌరవృత్తిదారులకు నిత్యదాయంలో 60 శాతం వాటాధనం పారితోషికంగా ఇవ్వాలని అదేశాలిచ్చారు. అప్పట్లో ఒక్కొక్కరికి కేవలం రూ.10వేలు మాత్రమే అందేవి. కానీ కేసీఆర్ ప్రకటనతో ఒక్కొక్కరికి రూ.20 నుంచి 25 వేల పారితోషికం వచ్చేది.
ఈ నేపథ్యంలో దేవస్థాన కల్యాణ కట్టలో 96మంది క్షౌరవృత్తిదారులు ఒకవర్గానికి చెందిన వారినే నియమించడంతో ఉపాధి కోల్పోయిన మరో 33 మంది నాయీ బ్రాహ్మణులు తమకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. అంతేకాకుండా దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్, ఈవోలను వేడుకోగా గతేడాది వీరిని సైతం కల్యాణ కట్టలోకి తీసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు.
33 మంది నుంచి రూ. 16.50 లక్షలు వసూలు..
క్షౌరవృత్తిదారులకు న్యాయపరంగా ఇక్కడ ఉపాధి అవకాశం కల్పించాల్సి ఉంది. అయితే గుట్టకు చెందిన కాంగ్రెస్‌కు చెందిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ భర్తతో పాటు కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు తదితరులు భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడినట్లు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 50 వేలు వసూలు చేయగా మొత్తం 33 మంది వద్ద నుంచి రూ. 16.50 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తున్నది. మొదట 20 మందికి అవకాశం కల్పించి మిగతా 13 మందికి విడతలవారీగా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
విధులను అడ్డుకునేందుకు యత్నం..
దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల ప్రకారం కల్యాణకట్టలో 33 మందికి అవకాశం కల్పించాలి. వీరిలో కేవలం 20 మందికే ఉపాధి కల్పించారు. మిగతా 13 మందికి విడతల వారీగా అవకాశం కల్పిస్తామని, అప్పటి వరకు 20 మందికి సం బంధించిన 30 శాతం కమీషన్‌ను 13 మందికి వర్తింపజేసేలా పెద్ద మనషుల సమక్షంలో తీర్మానం చేశారని నాయీబ్రాహ్మణ సహకార సంఘ ప్రతినిధులు తెలిపారు.
నాలుగు నెలలు ముగిసినా ఇప్పటి వరకు ఒక్కరూపాయి కూడా ఇవ్వకపోవడంతో తాము మోసపోయామని వారు తెలుసుకున్నారు. దీంతో తమకు అవకాశం కల్పించాలని కోరుతూ ఈవోకు వినతి పత్రం ఇవ్వడంతో పాటు శనివారం కల్యాణకట్ట వద్దకు వచ్చి విధులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. న్యాయపరంగా కల్యాణ కట్టలో అవకాశం కల్పించాలని లేనిపక్షంలో రిలే నిరాహారదీక్ష చేస్తామన్నారు. విషయం తెలుసుకున్న నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
వసూళ్లకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలి..
నాయీబ్రాహ్మణుల వద్ద కాంగ్రెస్ నాయకులు వసూళ్లకు పాల్పడటం సిగ్గుచేటని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్ అన్నారు. శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆదేశాలతోనే నాయకులు డబ్బులు వసూలు చేశారన్నారు. ఈ వసూళ్లలో ఎమ్మెల్యే వాటా ఎంతో చెప్పాలని, ఆయనకు డబ్బులు ముట్టినట్లు సమాచారం ఉందన్నారు. దీనిపై న్యాయ విచారణ జరిపి దోషులను శిక్షించి, నాయీ బ్రాహ్మణులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.