స్థానిక సంస్థల ఎన్నికల వేళ..బీఆర్ఎస్లోకి భారీగా వలసలు పెరగడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. అధికార కాంగ్రెస్ మాత్రం కలవరపడుతోంది. పక్షం రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులతోపాటు మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున గులాబీదళంలో చేరుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇబ్బడి ముబ్బడిగా అలవి కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిట్టనిలువునా ముంచి మోసం చేస్తుండడం… మరోపక్క బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలను కూడా కొనసాగించలేని దుస్థితిలో ప్రస్తుత ప్రభుత్వం ఉండడంతో జనం బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో జనం నాడి గుర్తిస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ కండువాలు కప్పుకుంటున్నారు. అసమర్థ కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయమని బీఆర్ఎస్ శ్రేణులు ధీమాతో ఉన్నాయి.
సూర్యాపేట, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ) : పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోరమైన పరాజయం ఎదురు కాబోతోందా అంటే…. ఆ పార్టీ నాయకుల తీరు చూస్తుంటే అవును అనిపిస్తుం ది. రాజకీయాలకు సంబం ధం లేకుండా జరిగే ఈ ఎన్నికల్లో అభ్యర్థులను మాత్రం ఆయా పార్టీలు బలపరుస్తాయి. నేడు జరిగే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఆయా పార్టీలకు సం బంధించిన అభ్యర్థులను బలపర్చుతూ మద్దతు ఇచ్చి గెలిపించేందుకు ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగుతున్నాయి.
అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లా లో బీజేపీకి అంతంత మాత్రం కూడా ప్రభావం లేకపోగా…. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమను ఊహించలేని రీతిన మోసం చేసిందనే అభిప్రాయంతో ప్రజలు ఉన్నారు. పదేండ్లపాటు అధికారంలో ఉండి తెలంగాణ ప్రాంతాన్ని 2014కు ముందు… తరువాత అని చెప్పుకునేలా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడం… తదనంతరం ఏదో ఒక రీతిన అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్పై బురద జల్లడంతోపాటు ఆరు గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్కటీ అమలు చేయకపోవడంతో ప్రజ ల్లో బీఆర్ఎస్పై ఎనలేని నమ్మకం, భరో సా పెరిగింది. దీంతో పక్షం రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కాం గ్రెస్ పార్టీ నుంచి అనేకమంది పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు.
అన్నింటా వైఫల్యం చెందుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై నిత్యం ఏదో ఒక రీతిన ప్రజలు శాపనార్థాలు పెడుతుండడంతో పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయని ఆ పార్టీ నాయకులు జంకుతూ వస్తున్నారు. దీంతో ప్రజలు ఎటువైపు ఉంటే తాము అటే ఉంటామని అభివృద్ధి, సంక్షేమాలకు నిలయమైన బీఆర్ఎస్కు జైకొట్టే పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పంచాయతీలు కైవసం చేసుకునేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. పంచాయతీలపై గులాబీ జెండా ఎగురవేసేందుకు నాయకులు, కార్యకర్తలను సమాయత్తం చేశారు.
ఇప్పటికే రెండేండ్లలో అన్నింటా విఫలమై కాంగ్రెస్ పార్టీ లకునారిల్లిపోతుండగా కొద్ది రోజులుగా జరుగుతున్న చేరికలు ఆ పార్టీని దిక్కుతోచని స్థితికి చేర్చుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో కొద్ది రోజులుగా పరిశీలిస్తే అర్వపల్లి మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి గోవర్థన్‌రెడ్డి, బొల్లం వెంకన్నతోపాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. పాలకీడు మండలం కొత్త తండాలో 150 కాంగ్రెస్ కుటుంబాలు, మటంపల్లి మాజీ ఎంపీటీసీ బొమ్మకంటి నరసింహారావు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
నల్లగొండ జిల్లాలో కొండమల్లేపల్లి మాజీ ఎంపీటీసీ చెనగోని శివగౌడ్తోపాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరగా కేతేపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ ప్రదీప్‌రెడ్డి, సీనియర్ నాయకులు అండేకార్ అశోక్, మాజీ సర్పంచ్ నాదరి రమేశ్, అండేకార్ వెంకటేశ్ష్లతో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరారు. చింతపల్లి మండలం అనాజిపురం బీఎస్పీ మండల అధ్యక్షుడు ముదిగొండ మొగిలయ్యతోపాటు అదే రోజు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరారు. మిర్యాలగూడ మండలం చింతపల్లిలో 200 మంది చేరగా, పెదవూర మండలం చింతపల్లి గ్రామ కాంగ్రెస్ కుటుంబాలు, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు లక్కుమల్ల మధుబాబుతోపాటు మరో 20 కుటుంబాలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరాయి..
నాగార్జునసాగర్ చలకుర్తిలో చల్ల అంజిరెడ్డితో పాటు 30 కుటుంబాలు, మునుగోడు మండలం కిష్టాపురం మాజీ ఉప సర్పంచ్ ఆకుల అనిల్‌తోపాటు కొందరు… శాలీగౌరారం మండలం చిత్తలూరు పీఏసీఎస్ డైరెక్టర్ గిరగాని వెంకన్న ఇలా చెప్పుకుంటూ పోతే… ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తం గా కాంగ్రెస్ పార్టీకి రాజీనామాల పరంపర కొనసాగుతుండగా బీఆర్ఎస్లో చేరికలు జోరుగా సాగుతున్నాయి. దీంతో పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ భవితవ్యం ఏంటో అనేది కాంగ్రెస్ నాయకులకు ప్రశ్నార్థకంగా మారింది. పార్టీకి సం బంధం లేనివి కాబట్టి గెలిచిన వారికి వెం టనే కాంగ్రెస్ కండువాలు కప్పి అంతా తమ పార్టీ వారే అని ప్రచారం చేయాలనే ఆదేశాలు అధిష్టానం నుంచి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఏదిఏమై నా….బీఆర్ఎస్లో చేరికలు మాత్రం కాం గ్రెస్‌ను కలవరపెడుతోంది.