యాదాద్రి భువనగిరి, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ దుస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. పార్టీలో ఏం జరుగుతుందో.. ఎవరు ఏ కుంపటి పెడుతున్నారో తెలియని పరిస్థితి. ఎవరికి వారు ఆధిపత్యాన్ని చాటేందుకు ప్రయత్నించి అభాసుపాలవుతున్నారు. నేతల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఇటీవల ఆలేరులో బీర్ల ఐలయ్యకు వ్యతిరేకంగా నియోజకవర్గంలోని కీలక నేతలంతా రహస్యంగా సమావేశమయ్యారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ జడ్పీ ఫ్లోర్ లీడర్ కుడుదుల నగేశ్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, టీపీసీసీ సెక్రటరీ జనగాం ఉపేందర్‌రెడ్డి, కల్లూరి రామచంద్రారెడ్డి, కొండల్‌రెడ్డి, సంజీవ్‌రెడ్డి రహస్యంగా భేటీ అయ్యారు. అంతా కలిసి బీర్ల ఐలయ్యకు వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించారు. బీర్ల ఐలయ్య వ్యవహారశైలి సరిగా లేదని, అందరినీ కలుపుకుపోవడం లేదని అంతర్గత సమావేశంలో మండిపడ్డారు. దాంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది.
బీఆర్ఎస్లోకి క్యూ..
కాంగ్రెస్ పార్టీలో రోజుకో రచ్చ, పంచాయితీలు, ప్రత్యేక కుంపట్లు జరుగుతుండటంతో పార్టీ శ్రేణులు అసహనానికి గురవుతున్నాయి. ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో పడుతున్నాయి. పార్టీలో పని చేయలేక పక్కచూపులు చూస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గులాబీ బాట పడుతున్నారు. గ్రామాలు, మండలాల నుంచి వందల సంఖ్యలో నిత్యం కారు పార్టీలో చేరుతున్నారు. విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్‌రెడ్డి సమక్షంలో వేలాదిగా గులాబీ కండువా కప్పుకొంటున్నారు. ఇప్పటికే బలమైన కేడర్‌తో బలంగా ఉన్న బీఆర్ఎస్ మరింత పటిష్టంగా మారింది. దాంతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆడియో లీక్‌తో జనంలో అసహనం..
ఇటీవల ఐలయ్య ఓ వ్యక్తితో మాట్లాడిన ఆడియో లీక్ అయ్యింది. అందులో ఆయన సదరు వ్యక్తిని బండ బూతులు తిట్టారు. తీవ్ర స్థాయిలో దూషించారు. ఏకంగా చంపుతానని బెదిరించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనంలోకి వెళ్లిపోయింది. ఓ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉండి.. ఇష్టమున్నట్లు దూషణలు చేయడం ఏంటని సెగ్మెంట్ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆడియో సదరు అంశానికి సంబంధం లేని ఓ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధిని తిట్టారు. దాంతో సదరు వర్గానికి చెందిన ఓట్లన్నీ గుంపగుత్తగా కాంగ్రెస్ వ్యతిరేకంగా పడతాయనే చర్చ జరుగుతున్నది.
భట్టి యాత్రలోనూ పంచాయితీలు..
ఇటీవల ఆలేరు కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గత నెలలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క యాత్రలోనూ జిల్లాలో వర్గపోరు బహిర్గమైంది. ఏకంగా భట్టి విక్రమార్క ముందే తిట్టుకున్నారు. బీర్ల ఐలయ్య, కల్లూరు రామచంద్రారెడ్డి మధ్య పంచాయితీనే నడవగా, భట్టి విక్రమార్క ఏం చేయలేక చూస్తూ ఉండిపోయారు. ఇదే యాత్రలో ఐలయ్య.. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్‌రెడ్డి మధ్య రచ్చ జరిగింది. మాజీ ఎమ్మెల్యే నగేశ్‌తో సైతం విభేదాలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఆయా నేతలు బహిరంగంగా ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటుండటంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.