కేతేపల్లి, మే 13 : బీఆర్ఎస్ కార్యకర్తపై ముగ్గురు యువకులు దాడి చేసి గాయపర్చిన ఘటన మండల పరిధిలోని చీకటిగూడెంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఆలుదాసు సతీశ్, వెంబడి రమేశ్ అనే ఇద్దరు వ్యక్తులు సోమవారం రాత్రి గ్రామంలో జరిగిన చిన్న తగాదా విషయమై మాట్లాడుకుంటూ ఒకరితో ఒకరు వాదనకు దిగారు. విషయం గమనించిన స్థానికులు ఇరువురికి సర్ది చెప్పి అక్కడ నుంచి పంపించి వేశారు. దీనిని మనసులో పెట్టుకొని వెంబడి రమేశ్ కుమారుడు వెంబడి అఖిల్, కేతేపల్లికి చెందిన మరో ఇద్దరు స్నేహితులతో కలిసి సతీశ్‌పై దాడి చేసేందుకు పథకం వేశారు.
మంగళవారం రాత్రి ఒంటరిగా వస్తున్న సతీశ్‌తో సోమవారం జరిగిన పంచాయతీ గురించి వారు వాదనకు దిగారు. మాటామాట పెరగడంతో ముగ్గు రూ కలిసి సతీశ్‌పై విచక్షణా రహితంగా కర్రలతో దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న సతీశ్ అరుపులు విని స్థానికులు అక్కడకు వచ్చి డయల్ 100కు ఫోన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్దకు వచ్చి బాధితుణ్ని చికిత్స నిమిత్తం సూర్యాపేట దవాఖానకు తరలించారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. సతీశ్ సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్త ఆలుదాసు సతీశ్‌పై జరిగిన దాడిని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రంగా ఖండించారు. సూర్యాపేట ఆర్వీ దవాఖానలో చికిత్స పొందుతున్న సతీశ్‌ను బుధవారం ఆయన పరామర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అధైర్యపడవద్దని బీఆర్ఎస్ తరఫున కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజకీయ కక్షతో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడటం దుర్మార్గమన్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నించినందునే సతీశ్‌పై దాడి చేశారని ఆరోపించారు.
నియోజకవర్గంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని, బీఆర్ఎస్ కార్యకర్తలే లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ శ్రేణులు అధికారం అడ్డం పెట్టుకొని దాడులకు దిగుతున్నాయన్నారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ జరిపి నిందితులను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఆయన వెంట పార్టీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం వెంకట్‌రెడ్డి, చిముట వెంకన్న యాదవ్, నాయకులు బంటు మహేందర్, నల్లపు నాగేశ్వర్రావు, తదితరులు ఉన్నారు.