సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 28 : వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేసిన అన్ని వర్గాల ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్, రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు.
సభలో పార్టీ అధినేత కేసీఆర్ ప్రజలకు అనేక విషయాలపై తన సందేశం వినిపించారని, కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనను, ఫెయిల్యూర్ కండ్లకు కట్టినట్లు వివరించారని అన్నారు. పోలీసు అధికారులు బీఆర్ఎస్ కార్యకర్తలపై పెడుతున్న తప్పుడు కేసులను ఎదుర్కొనేందుకు తాను లీగల్ సెల్‌కు అండగా ఉంటానని భరోసా ఇచ్చారని చెప్పారు. తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని స్పష్టం చేశారని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా సభకు హాజరైన ప్రజలు, కేసీఆర్ మాట్లాడిన మాటలను చూసి బెంబేలెత్తిన కాంగ్రెస్ నాయకులు లేని పోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తప్పుడు మాటలు, అబద్ధాల్లో కాంగ్రెస్ నాయకులు ఆరితేరారని ప్రజలు గ్రహించారని, ఇకనైనా మారి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్వచ్ఛందంగా లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేసి దేశంలోనే చరిత్ర సృష్టించారని, బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వాతావరణం కూడా సహకరించిందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా ప్రజల కోసమే పని చేస్తుందని, కేసీఆర్ నాయకత్వంలో ముందుకు సాగుతుందని చెప్పారు.