పెన్పహాడ్, ఆగస్టు 16 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. శనివారం పెన్పహాడ్ మండలం బ్రిజ్జి అన్నారం గ్రామంలోని జె ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందజేసి మాట్లాడారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రూ.2 లక్షల రుణమాఫీ పూర్తిగా చేయకుండా, చేసినం అని దొంగ లెక్కలు చెబుతూ రైతులను మోసం చేయడం సరికాదన్నారు. రైతు భరోసా అమలు, మహిళలకు రూ.2,500, వృద్ధులకు పింఛన్లు పెంచకుండా మోసం చేసారన్నారు.
కాళేశ్వరం ద్వారా మండలానికి నీళ్లు విడుదల చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. హామీల అమలులో ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి మాట తప్పరని, సంక్షేమ పథకాలకు ఆంక్షలు విధిస్తూ లబ్ధిదారులను తగ్గించే కుట్రలను చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చెర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీఓ వేణుమాధవ్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చెర్మన్ శ్రీనివాస్, సింగిల్ విండో చెర్మన్లు వెన్న సీతారాంరెడ్డి, నాతల జానకి రాంరెడ్డి, తాసీల్దార్ లాలూ నాయక్, ఎంపీడీఓ జానయ్య, తూముల సురేశ్ రావు, మాజీ ఎంపీపీ నెమ్మది భిక్షం, ఆర్ఐ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.
మార్కెట్ చెర్మన్ కొప్పుల వేణారెడ్డ్డి కార్యక్రమానికి షెడ్యూల్ ప్రకారం కాకుండా లేటుగా వచ్చారు. లేటుగా వచ్చిందే కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుల అతి ఉత్సాహంతో పట్టాల పంపిణీ ఎలా చేస్తారని అధికారులను కాసేపు ఉక్కిరిబిక్కిరి చేశారు. దీంతో చేసేదేమి లేక అధికారులు మళ్లీ అతడి చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
Penpahad : ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలి : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి