నల్లగొండ సిటీ, జనవరి 20 : కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నల్లగొండ డిపో జేఏసీ నాయకులు బాసాని వెంకటయ్య, ఎన్ఆర్సీ రాజు, ఈఎస్ రెడ్డి, ఏఎల్ స్వామి అన్నారు. మంగళవారం టీజీఎస్ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నల్లగొండ డిపో జేఏసీ ఆధ్వర్యంలో డిపో సిబ్బంది అంతా ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించి పోరాట దినంగా పాటించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా ఆర్టీసీ కార్మికులను, ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. అలాగే యూనియన్ల పునరుద్ధరణ జరపాలని, 2021, 2025 వేతన సవరణలు అమలు చేయాలని, సిబ్బంది అందరికి సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.