– కన్నెపల్లి పంప్ హౌస్‌ను వెంటనే ప్రారంభించి సాగునీరు అందించాలి
– కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
నల్లగొండ, జూలై 07 : పంట పొలాలను బీడు భూములుగా మార్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్‌ను వెంటనే ప్రారంభించి సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం కోదాడ నియోజకవర్గ పరిధిలోని మోతే మండలం రాఘవాపురం గ్రామంలో పంట కాలువలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్‌ను ప్రారంభించి సాగునీరు అందించాలన్నారు. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన ధర్నాలో రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల ప్రాధాన్యాన్ని, ముఖ్యంగా కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందించి రైతులకు కలిగిన ప్రయోజనాలను ప్రజలకు వివరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఎత్తిపోతల పథకాలు తెలంగాణ వ్యవసాయ రంగానికి జీవనాడిగా నిలిచాయని, వాటిని సక్రమంగా నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. అవగాహన, అనుభవం లేని నేటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రిపేర్లు, ప్రమాదం అంటూ కాలయాపన చేస్తుందని దుయ్యబట్టారు. 1983 ఎస్ఆర్ఎస్పీ ఫేస్-2 ను నాటి ముఖ్యమంత్రి తారకరామారావు శంకుస్థాపన చేస్తే తర్వాత ప్రభుత్వాలు కాలువలు తవ్వి గాలికి వదిలేశాయని గానీ నీళ్లు మాత్రం వదలలేదన్నారు. 2018 తర్వాతనే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పాలనలో ఎస్ఆర్ఎస్పీ కాలువలో సాగునీరు పారించడం సాధ్యమైనదని, వేసవికాలంలో చెరువులను అలుగు పోపించిన ఘనత కేసీఆర్‌కు మాత్రమే దక్కుతుందని కొనియాడారు.
తమ త్యాగం వల్లే దిగుబడి పెరిగిందని జబ్బలు చరుచుకునే నాయకులు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. కాళేశ్వరం ద్వారా ఎస్ఆర్ఎస్పీ, ఎస్ఆర్ఎస్పీ నుండి కోదాడ వరకు సాగునీరు తెచ్చింది, చెరువుల పునరుద్ధరణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. ఈరోజు వృథాగా నీళ్లు పోతుంటే రైతులకి సాగునీరు అందించే అవగాహన లేని నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. పంట పొలాలను బీడు భూములుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని, మందికి పుట్టిన బిడ్డలు తమ బిడ్డలు అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ నాయకులు రైతులకు ఇబ్బంది కలగకుండా కార్యచరణ చేపట్టాలన్నారు. రాజకీయ కక్ష సాధింపులతో ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం సమంజసం కాదన్నారు. రైతుల కష్టాలను అర్థం చేసుకుని ప్రభుత్వం వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్‌ను ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.

‘పంట పొలాలను బీడు భూములుగా మార్చుతున్న ప్రభుత్వం’