Kangana Ranaut | బాలీవుడ్ నటి ఇషా కొప్పికర్ (Isha Koppikar) తాను ఓ గర్వించదగిన అంధభక్తురాలిని (Proud Andhbhakt) అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. రాజకీయ పార్టీల పట్ల కాకుండా దేశ ప్రగతిపై తనకు ఉన్న అచంచలమైన ప్రేమకు తాను భక్తురాలినంటూ ఆమె స్పష్టం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ, ప్రముఖ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) స్పందిస్తూ ఇషాకు పూర్తి మద్దతు తెలిపారు. దేశం పట్ల ఇషా ప్రదర్శించిన భక్తిని, దేశభక్తిని ఆమె కొనియాడారు.
కేంద్రంలో అధికార పార్టీని పొగుడుతూ.. దేశ ప్రయోజనాలకంటే ఒక పార్టీకి బానిసలాగా కొమ్ముకాస్తూ గుడ్డిగా సమర్థించే వారిని నెటిజన్లు అంధభక్తులు అని పిలవడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పదాన్ని నటి ఇషా కొప్పికర్ సరికొత్త కోణంలో నిర్వచించారు. ఒక వీడియోలో ఇషా మాట్లాడుతూ, తాను ఆ పదాన్ని ఉపయోగించడానికి ఎలాంటి మొహమాటం లేదని తేల్చిచెప్పారు.
అవును, నేను అంధభక్తురాలినే. నా దేశాన్ని ప్రేమించడం, అది ప్రగతి సాధించాలని కోరుకోవడం భక్తి అయితే, అవును… నేను గర్వంగా భక్తురాలిని, అంధభక్తురాలిని అని అన్నారు. అయితే తన భక్తి ఏ రాజకీయ పార్టీ పట్ల లేదు నా దేశం పట్ల మాత్రమే. నేషన్ ఫస్ట్ (Nation First). నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించగలను, దాని విధానాలను విభేదించగలను. అయినప్పటికీ నా దేశాన్ని హృదయపూర్వకంగా ప్రేమించగలను అని ఇషా వివరించారు. భారతదేశం పట్ల గర్వంగా ఉండటంలో ఎలాంటి తప్పులేదని, ఇక్కడే తాను జీవనోపాధి పొందుతున్నానని, అవకాశాలను అందుకుంటున్నానని పేర్కొన్నారు. ఇక ఇషా కొప్పికర్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియోను బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్తూ ఆమెకు సంఘీభావం తెలిపారు. ఇషా అభిప్రాయాలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు చెప్పారు.
View this post on Instagram