మునుగోడు జూలై 04 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట యువకులకు ఎన్నెన్నో హామీలు గుప్పించి, గద్దెనెక్కిన తర్వాత వాటిని తుంగలో తొక్కుతుందని బీజేవైఎం రాష్ట్ర నాయకుడు పిన్నింటి నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మునుగోడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతి నెల రూ.4 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని, విద్యా, ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేసి రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పిస్తామని హామీలు ఇచ్చి అందులో ఏ ఒక్కటీ అమలు చేయకపోవడం సిగ్గు చేటన్నారు.
రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే దానికి చట్టబద్ధత కల్పిస్తామని తెలిపారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా జాబ్ క్యాలెండర్ జాడే లేదన్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయని కుటుంబాలకు దూరంగా ఉంటూ, రాత్రిపగలూ గ్రంథాలయాల్లో పుస్తకాలతో కుస్తీ పడుతున్నా నిరుద్యోగుల గోస కాంగ్రెస్ సర్కారుకు పట్టడం లేదన్నారు.
ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించి, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు. లేనియెడల రాబోయే రోజుల్లో బీజేవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగులకు అండగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి ఓడిగె స్వామి, నాయకులు పెరుమాళ్ల రాము, దోటి సాయికుమార్ పాల్గొన్నారు.