కోదాడ, జులై 03 : విద్యార్థుల భవిష్యత్తో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని పీడీఎస్యూ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి డి.రవి అన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కోదాడ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ తీసి, ధర్నా నిర్వహించి ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు అండదండగా ఉంటామని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలు గడుస్తున్నప్పటికీ విద్యార్థుల సమస్యలపై కనీస స్పందన లేదని విమర్శించారు.
విద్యార్థి వ్యతిరేక విధానాలు కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ది చెబుతారన్నారు. వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేయనున్నట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కామల్ల ఉదయ్, పులి రాఖి, జిల్లా నాయకులు డి.వేణు, డివిజన్ నాయకులు గుండు ఉమేశ్, బి.యశ్వంత్, నూనె కల్యాణ్, రాము కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.