మిర్యాలగూడ, జూన్ 20 : రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలో రైతుల చేతిలో గుణపాఠం తప్పదని మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి అన్నారు. శనివారం రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట, మంత్రులు మరొక మాట చెబుతున్నారన్నారు. సీఎం రైతుల ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని చెప్తుండగా సివిల్ సప్లయ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం కేంద్రం చెప్పిన కోటా వరకే ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్తున్నాడని ఇది రైతులకు శరాఘాతంలాగా మారుతుందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి రైతుల ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని ఆరోజు డిమాండ్ చేశారని ఈరోజు అధికారంలోకి వచ్చాక కేంద్రం కేటాయించిన కోటా వరకే కొనుగోలు చేస్తామని చెప్పడాన్ని చూస్తుంటే రైతులను మోసం చేయడమే అని విమర్శించారు.
ఆనాడు కేసీఆర్ పాలనలో వ్యవసాయం అంటే రైతులకు పండుగలా సాగిందని రైతులకు 11 పర్యాయాలు రైతు బంధు ద్వారా ఎకరాకు రూ.5,000 చొప్పున 72 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశారని వివరించారు. రైతు చనిపోయిన వారం రోజుల్లోనే రైతు బీమా ద్వారా ఆ రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కు అందజేశారని వివరించారు. వ్యవసాయ రంగానికి 24 గంటలు కరెంటు అందించి రైతుల పాలిట కేసీఆర్ దేవుడిలాగా మారాడని తెలిపారు. కేసీఆర్ హయాంలో ముందస్తు ప్రణాళికలు చేసుకోవడం ద్వారా రైతులకు సరిపడా యూరియా, కాంప్లెక్స్ ఎరువులు, విత్తనాలు సీజన్ కు ముందే సిద్ధంగా ఉంచేవారని ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా లేక ఎరువులు దొరికే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చేస్తున్నారన్నారు. యూరియా కోసం రైతులు పడిగాపులు పడుతున్నారని దీనికి తోడు యూరియా కావాలంటే యాప్ లో బుక్ చేసుకోవాలని లింక్ పెట్టడంతో రైతులకు స్మార్ట్ ఫోన్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. యూరియా అందించలేక రైతులు బారులు తీరి నిలబడడం, నిరసనలు చేయటం వీటన్నిటిని అరికట్టేందుకే అడ్డదారిలో యాప్ తీసుకొచ్చారని రైతులు ముక్తకంఠంతో యాప్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. రైతులు పండించిన అన్ని రకాల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఏడు రకాల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తామని మంత్రులు చెప్పడాన్ని చూస్తుంటే రైతులను మోసం చేసేందుకే ముఖ్యమంత్రి, మంత్రులు కపట నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఎప్పుడైనా రైతులు అత్యధిక దిగుబడులు వచ్చే పంటలను సాగు చేస్తారని దీనిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వాగతించాలని అంతేకానీ అత్యధిక దిగుబడులు వచ్చే పంటలు సాగు చేయవద్దని చెప్పడాన్ని చూస్తుంటే రైతులు దివాలా తీయాలని చూస్తున్నట్లుగా ప్రభుత్వానికి ఉన్నదని అర్థమవుతుందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు మానుకోవాలని గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు చేయూత అందించినట్లుగా చేయూత ఇవ్వాలని లేకపోతే రైతులే తగిన విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు దుర్గంపూడి నారాయణరెడ్డి, మట్టపల్లి సైదులు యాదవ్, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, పాలుట్ల బాబయ్య, మోషన్ అలీ, చిర్ర మల్లయ్య యాదవ్, మిర్యాల మధుసూదన్, వీర కోటిరెడ్డి, ఎడవల్లి శ్రీనివాస్ రెడ్డి, హతిరామ్ నాయక్, పెద్ది శ్రీనివాస్ గౌడ్, రంగారెడ్డి ఇలియాస్, కోటేశ్వరరావు, విజయలక్ష్మి, రమాదేవి, ఎండీ షోయబ్ పాల్గొన్నారు.