నల్లగొండ రూరల్, ఆగస్టు 21 : రైతులకు యూరియాను అందజేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని బీఆర్ఎస్ నల్లగొండ మండల సీనియర్ నాయకుడు గుండెబోయిన జంగయ్య యాదవ్ అన్నారు. గురువారం నల్లగొండలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. యూరియా కొరత లేదని ప్రభుత్వం చెప్పడం సిగ్గు చేటన్నారు. యూరియా కోసం రైతులు పొద్దస్తమానం ఎరువుల దుకాణాల వద్ద, రైతు ఆగ్రో ఏజెన్సీస్ వద్ద పడుకోవడం అంతా చూస్తున్నదేనన్నారు. నల్లగొండ మండలానికి 4 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ఇప్పటివరకు 3 వేల మెట్రిక్ టన్నులు అందించామని వ్యవసాయ అధికారులు చెబుతున్నప్పటికీ, అందులో వాస్తవం లేదన్నారు.
నల్లగొండ మండలానికి కేటాయించిన యూరియాను నల్లగొండ చుట్టూ ఉన్న సుమారు 5 మండలాలకు చెందిన రైతులు ఇక్కడికే వచ్చి తీసుకెళ్తుండడంతో మండలంలోని పలు గ్రామాల రైతులు యూరియా అందక నష్ట పోతున్నట్లు తెలిపారు. రైతులు యూరియా కోసం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితిని ఈ కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఏనాడూ రైతులకు ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా చూసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రైతులు, అన్ని వర్గాల ప్రజలు సరైన గుణపాఠం చెబుతారన్నారు.