సూర్యాపేట, ఏప్రిల్ 25 : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఇచ్చిన ఏ ఒక్క హామీ పూర్తిగా నేరవేర్చడం లేదని దీంతో లబ్ధిదారుల్లో తీవ్రమైన నిరాశ కనబడుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అలాగే దివ్యాంగులకు త్రీ వీలర్ వెహికల్స్, అంగన్వాడీలకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు కేసీఆర్ ఇచ్చిన లక్ష తప్ప తులం బంగారం ఇంకెప్పుడిస్తారని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారన్నారు. ఈ విషయం గురించి మహిళల్లో తీవ్రంగా చర్చ జరుగుతుందని, ఆడపిల్ల పెండ్లికి తులం బంగారం త్వరగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారంటే అది కాంగ్రెస్ పాపమేనని, కార్మికుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వానిదే భాద్యత అన్నారు.

అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
వడ్లు, మక్కల కొనుగోలు విషయంలోనూ జాప్యం సరికాదని జగదీశ్‌రెడ్డి అన్నారు. కొనుగోళ్లు అన్నీ కేంద్రాల్లో సజావుగా కొనసాగించాలన్నారు. మబ్బులు చూసి రైతుల గుండెల్లో గుబులు మొదలైతుంది. అకాల వర్షాలు పడకముందే కొనుగోలు సజావుగా పూర్తి చేయాలన్నారు. పేరుకే సెంటర్లు ప్రారంభిస్తున్నారు గానీ కొనుగోళ్లు మాత్రం చేయడం లేదన్నారు. దీంతో దళారుల చేతిలో రైతులు తీవ్రంగా మోసపోతున్నట్లు తెలిపారు. మళ్లీ పాత పద్ధతుల్లో దళారుల చేతుల్లో మోసపోయే దుస్థితి ఏర్పడిందన్నారు. కేసీఆర్ పాలన కంటే ముందున్న రోజులే మళ్లీ దాపురిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీళ్ల విషయాంలోనూ తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని, విద్యుత్ కోతలు విపరీతంగా మొదలైనవని, ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని రంగాల్లోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా మేలుకొని హామీల అమలుపై, అభివృద్ధిపై దృష్టి పెడితే మంచిదని ఆయన హితవు పలికారు.