దేవరకొండ, సెప్టెంబర్ 07 : నీళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ద్రోహం, మోసం చేస్తోందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతావత్ భీల్యానాయక్ తీవ్రంగా విమర్శించారు. డిండి ప్రాజెక్టును KLI ద్వారా నింపి, డిండి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డిండి మండల కేంద్రంలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ… KLI ద్వారా డిండి ప్రాజెక్టును నింపిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి రైతుల పొలాలకు నీరు అందించిందని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం డిండి ప్రాజెక్టు, ఆయకట్టు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. డిండి ప్రాజెక్టును KLI ద్వారా వెంటనే నింపి, ఆయకట్టు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్‌కు చుక్క నీరు రాకుండా పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నాగార్జున సాగర్ నిండేంత వరకు పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
ఎవరి ఆదేశాలతో పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలిస్తున్నారో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యా నాయక్ డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు వద్ద రేవంత్ రెడ్డి లొంగిపోయి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డిండి ప్రాజెక్టును KLI ద్వారా నింపే వరకు, డిండి ఆయకట్టు రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజీనేని వెంకటేశ్వర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ మహాధర్నాలో పార్టీ రాష్ట్ర నాయకుడు నేనావత్ కిషన్ నాయక్, పీఏసీఎస్ చైర్మన్లు పల్లా ప్రవీణ్ రెడ్డి, మాధవరం శ్రీనివాస్ రావు, సర్పంచులు మల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, కృష్ణయ్య, పట్టణ అధ్యక్షుడు గిరమోని శ్రీను, రామావత్ వెంకట్రామ్, తండు వెంకటయ్య, బొడ్డుపల్లి జయంత్, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.