సన్నాలకు సర్కారు రూ.500 బోనస్ ఉత్తముచ్చటగానే మిగిలిపోతున్నది. తొలుత అన్ని పంటలకు బోనస్ అని మోసపు మాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అమల్లో మాత్రం సన్నాలకే అంటూ సన్నాయి నొక్కులు నొక్కి రైతులకు తీరని నష్టం మిగిల్చింది. జిల్లాలో సన్నాల దిగుబడి అంతంతే రాగా.. ప్రభుత్వం కొన్నది కూడా ఏమీ లేదు. తాలు, తేమ, గింజ పొడవు అంటూ అనేక కొర్రీలు పెడుతుండటంతో పండిన కొద్దిపాటి ధాన్యాన్ని కూడా ప్రైవేట్‌లోనే అమ్ముతున్న దుస్థితి నెలకొంది.
– యాదాద్రి భువనగిరి, మే 10 (నమస్తే తెలంగాణ)
యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్లో 2.80లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. మొత్తంగా 6.5లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ సీజన్లో నాలుగున్నర లక్షల టన్నుల వడ్లు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందుకోసం జిల్లాలో 327 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పటి వరకు జిల్లా అంతటా 1.60 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేశారు. అనేక చోట్ల కేంద్రాలు ప్రారంభించినా.. కొనుగోళ్లలో జాప్యం నెలకొంటున్నది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ పోసిన ధాన్యం అక్కడే కుప్పలుగా దర్శనమిస్తున్నాయి.
యాసంగి సీజన్ కావడంతో రైతులు ఎక్కువగా దొడ్డు రకానికే మొగ్గు చూపారు. ముఖ్యంగా మూసీ బెల్ట్‌లోని బీబీనగర్, భూదాన్ పోచంపల్లి, వలిగొండ, రామన్నపేట మండలాల్లో 99శాతం దొడ్డు రకాలే వేస్తారు. ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించినా సన్నాలు వేసేందుకు రైతులు ముందుకు రాలేదు. వరి ధాన్యం ఏ గ్రేడ్ రకం క్వింటాల్‌కు గతేడాది రూ.2,203 చెల్లించగా, ఈ సారి 2,320 రూపాయలు మద్దతు ధరగా ప్రకటించారు. సాధారణ ధాన్యానికి క్వింటాల్‌కు పోయినసారి రూ.2,183 ఉండగా, ఈ సారి 2300 రూపాయలకు పెంచారు. ఈ లెక్కన సన్న, దొడ్డు రకాలకు మధ్య తేదా రూ.117 మాత్రమే. ఇక దొడ్డు రకాలతో పోలిస్తే సన్న రకాల పంటకాలం 15 నుంచి 20 రోజులు అధికంగా ఉంటుంది. దీంతో దిగుబడి చేతికొచ్చి.. విక్రయించే సమయంలో అకాల వర్షాలు పడుతాయేమోనని కొందరు రైతులు ఆందోళన చెందుతున్నారు. సన్నాలకు దోమపోటు అధికం. రసాయన మందుల పిచికారీ వల్ల పెట్టుబడి వ్యయం పెరుగుతుంది. యాసంగి సన్న వడ్లను బియ్యంగా మార్చే సమయంలో నూక శాతం ఎక్కువగా వస్తుందని పలువురు పేర్కొంటున్నారు.
ఈ సారి వ్యవసాయ శాఖ కార్యాచరణలో సన్నాల సాగు లేదని పేర్కొనడం విశేషం. గతంలో ధాన్యం కొనుగోళ్లలో సన్నాల కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సారి పంట లేదంటూ ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేయలేదు. సాధారణ కేంద్రాల వద్దే ఎవరైనా విక్రయించవచ్చని సివిల్ సప్లయ్ అధికారులు చెబుతున్నారు. ధాన్యం లేనప్పుడు సపరేట్గా ఏర్పాటు చేసినా లాభం ఉండదని పేర్కొంటున్నారు. అయితే.. పండించిన ధాన్యంలో కొంత రైతుల సొంతానికి పోగా మిగిలింది విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు 200 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. అయితే బోనస్ కోసం సర్కారులో అమ్ముదామంటే అనేక కొర్రీలు పెడుతుంది. దీంతో కొందరు బయట ప్రైవేట్ వ్యాపారుల వద్ద అమ్ముకుంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు అన్ని రకాల పంటలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక మాట మార్చింది. సన్నాలకు మాత్రమే ఇస్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,320, కామన్ గ్రేడ్ రకానికి రూ.2,300 మద్దతు ధర కల్పించనుంది. సన్న ధాన్యం క్వింటాల్‌కు బోనస్ రూ.500 కలిపి రూ.2,820 కట్టించనున్నారు. 33 రకాల సన్నాల్లో బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, హెచ్ఎంటీ, సోనా, జైశ్రీరాం వంటి రకాలు ఉన్నాయి. సన్నాలకు మాత్రమే బోనస్ ఇవ్వనుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మొత్తం నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ అనుకున్నా బోనస్ లేకపోవడంతో రైతులు 200కోట్ల వరకు కోల్పోనున్నారు.