యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బడుల రాతను మార్చేందుకు తీసుకొచ్చిన మన ఊరు-మన బడి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పాతరేసింది. కార్పొరేట్ దీటుగా పాఠశాలలను తీర్చిదిద్దాలనే పథకం ఉద్దేశాన్ని తుంగలో తొక్కింది. నిధులు విడుదల చేయకుండా అడ్డుపుల్ల వేస్తోంది. చేసిన పనులకు రెండేండ్లు దాటినా బిల్లులు చెల్లించకుండా తాత్సారం చేస్తున్నది. ఫలితంగా సొంత నిధులతో అభివృద్ధి చేసిన కాంట్రాక్టర్లు, స్కూల్ కమిటీ చైర్మన్లు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇటీవల వలిగొండ మండలంలోని సంగెం ప్రభుత్వ పాఠశాలకు మాజీ సర్పంచ్ ఏకంగా తాళం వేయడం చర్చనీయాంశమైంది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా నాణ్యమైన విద్యతోపాటు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించేందుకు నాటి సీఎం కేసీఆర్ మన ఊరు-మన బడి పథకాన్ని తీసుకొచ్చారు. మొదటి విడతలో జిల్లాలో 251 స్కూళ్లను బాగు చేయాలని ఎంపిక చేశారు. వీటిలో 83 హైస్కూళ్లు, 148 ప్రాథమిక, 20 మాధ్యమిక ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో రూ. 30లక్షల్లోపు నిధులు అవసరమైనవి 225 బడులు, ఇక రూ. 30 లక్షల కంటే ఎక్కువ నిధులు కావాల్సిన స్కూళ్లు 26 ఉన్నాయి. వీటిలో 61 పాఠశాలల్లో అన్ని పనులు పూర్తయ్యాయి. మిగతా వాటిలో 50 నుంచి 70 శాతం మేర పనులు జరిగాయి. నిధులు రాకపోవడంతో గత్యంతరం లేక పనులు ఆపేశారు.
విద్యా శాఖ ఎంపిక చేసిన పాఠశాలల్లో 12 రకాల మౌలిక వసతులు కల్పించాలని అప్పటి ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగం గా మన ఊరు- మన బడి కార్యక్రమం కింద ఎంపిక చేసిన బడుల్లో నీటి వసతితోపాటు మరుగుదొడ్లు, విద్యుత్, తాగునీరు, ఫర్నిచర్, పెయింటింగ్, మరమ్మతులు, గ్రీన్ చాక్ బోర్డులు, ప్రహరీలు, వంటగది, అదనపు తరగతి గదులు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాల్, డిజిటల్ విద్య అమలుకు చర్యలు తీసుకుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకునేలా సకల సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో అనేక చోట్ల పాఠశాలలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యా యి. ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో పునర్నిర్మాణ పనులు, మరమ్మతులు జరిగాయి. పక్కా భవనాలు రంగులతో కళకళలాడాయి.
యాదాద్రి భువనగిరి జిల్లాలో చాలా చోట్ల 60 నుంచి 80 శాతం పనులు పూర్తయ్యాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటినా పూర్తయిన పనులకు బిల్లులు విడుదల చేయలేదు. ప్రభుత్వం వచ్చాక ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. బీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చిన పథకం కావడంతో కక్షపూరితంగా వ్యవహరిస్తూ బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో చేసిన పనులకు సంబంధించి సుమారు రూ. 7 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. దాదాపు 150 నుంచి 200 మందికి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఎస్ఎంసీ చైర్మన్లు, కాంట్రాక్టర్లు అప్పులు తెచ్చి నిర్మాణ పనులు చేపట్టారు. రూ. వేలు, లక్షల మిత్తీలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వానికి, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.