నల్లగొండ, జూన్ 26: గొర్రెల సబ్సిడీ పథకానికి మంగళం పాడిన కాంగ్రెస్ సర్కార్ నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు నియోజక వర్గ గొల్లకుర్మలకు ఇచ్చిన డబ్బులను సైతం వెనక్కి లాగేసుకుంది. రెండున్నరేండ్లుగా ఫ్రీజ్ లో ఉన్న ఖాతాలను అన్‌ఫ్రీజ్ చేసి, లబ్ధిదారులకు తెలియకుండానే తీసుకుంది. 2,678 మందికి సబ్సిడీ రూపంలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రూ.42.31కోట్ల నిధులను రేవంత్ సర్కార్ ఆదేశాలతో బ్యాంకర్లు ఈనెల 11న కలెక్టర్ ఖాతాకు బదిలీ చేశారు. రూ.1.75లక్షల యూనిట్ కాస్ట్ లో ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇచ్చిన 75శాతం(రూ.1.58లక్షలు) నిధులు లబ్ధిదారుల ఖాతాల నుంచి బ్యాం కర్లు కలెక్టర్ ఖాతాకు బదిలీ చేశా రు. దీంతో రెండున్నరేండ్లుగా వస్తాయనుకున్న డబ్బు లు కలెక్టర్ ఖాతాకు బదిలీ కావడంతో గొల్లకుర్మలు రేవంత్ ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు.
జీవితాల్లో వెలుగులు నింపాలని…
బీఆర్ఎస్ ప్రభుత్వం వృత్తిదారుల జీవన విధానాన్ని మెరుగుపర్చాలనే ఆలోచనతో గొల్లకుర్మలకు గొర్రెల యూనిట్లు, మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలతోపాటు ఇతర యూనిట్లు, నాయీబ్రాహ్మణులకు కిట్లు, ఉచిత కరెంట్… ఇలా ప్రతి వృత్తి కుటుంబానికి ఏదో విధంగా లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు చేపట్టింది. అయితే 75శాతం సబ్సిడీతో గొల్లకుర్మలకు 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఇవ్వాలని తలంచిన కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు విడతలుగా ఇవ్వాలని నిర్ణయించి అమలు చేశారు.
అందులో భాగంగానే నల్లగొండ జిల్లాలో 64వేల మంది గొల్లకుర్మలకు సబ్సిడీ గొర్రెల పథకాన్ని ఇవ్వాలని నిర్ణయించిన బీఆర్ఎస్ సర్కార్ తొలి విడుతలో రూ.1.25లక్షల యూనిట్ కాస్ట్‌తో 75 శాతంతో 32వేల మందికి అందచేశారు. ఆ తర్వాత మలి విడతలో భాగంగా 2022 అక్టోబర్‌లో మునుగోడు నియోజక వర్గంలో ఉన్న 2,678 మంది లబ్ధిదారులకు 1.75లక్షల యూనిట్ కాస్ట్‌తో 75శాతం సబ్సిడీ అందిస్తూ సబ్సిడీ కింద ప్రతి లబ్ధిదారుడికి అప్పట్లో రూ.1.58లక్షలు వారి ఖాతాల్లో జమ చేసింది.
బై ఎలక్షన్ నేపథ్యంలో ఖాతాలు ఫ్రీజ్..
రెండో విడుతలో భాగంగా మునుగోడు నియోజక వర్గం వ్యాప్తంగా ఉన్నటువంటి 2,678 మంది గొల్లకుర్మలకు ఒక్కొక్కరికీ 25శాతం రైతు వాటా పోనూ రూ.1.58లక్షల చొప్పున వారి ఖాతాల్లో నాటి సర్కార్ జమ చేసింది. అయితే 2022 అక్టోబర్‌లో జరిగిన బై ఎలక్షన్ నేపథ్యంలో ప్రతిపక్షాల ఫిర్యాదుతో డబ్బులు జమ చేసిన రైతుల ఖాతాలను ఎలక్షన్ కమిషన్ ఫ్రీజ్ చేసింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి ఖాతాలు ఫ్రీజ్‌లోనే ఉండటంతో ప్రస్తు తం ప్రభుత్వం ఇచ్చిన రైతు రుణమాఫీ, రైతు భరోసా కూడా తీసుకోలేని పరిస్థితి. ఇన్నాళ్ల తర్వాత ప్రభుత్వ నిర్ణయంతో బ్యాంకర్లు 2, 678 మంది గొల్ల కుర్మల ఖాతాల్లో ఉన్న రూ. 42,31,24,000 తిరిగి కలెక్టర్ ఖాతాకు బదిలీ చేయటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన డబ్బులు మీరు ఎలా తీసుకుంటారని..ఆ డబ్బులు తమ ఖా తాల్లోకి జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే..కాంగ్రెస్ గుంజుకుంది..
బీఆర్ఎస్ ప్రభుత్వం మా ఊర్ల మొదటి విడత కొంతమందికి గొర్లు కొనుక్కోవడానికి సబ్సిడీ డబ్బులు ఇస్తే, రెండో విడతగా నాతోపాటు మరికొంతమందికి 2022లో రూ.1.58లక్షలు ఇచ్చింది. అయ్యాల నా ఖాతాలో డబ్బులు జమచేసిన తర్వాత తీసుకునే ముందు ఎన్నికల అధికారులు ఖాతాలన్నీ ఫ్రీజ్ చేయించటంతో ఆగిపోయాయి. అవి ఇవ్వమని ఎన్నోసార్లు కలెక్టర్ చుట్టూ తిరిగితే ఇస్తారనుకున్నాం..కానీ మాకు తెల్వకుండానే డబ్బులు మొత్తం వెనక్కి తీసుకున్నారు.
– ఏటెల్లి లింగయ్య, రేవల్లి, నాంపల్లి మండలం
ఉన్న డబ్బులే ఊడగుంజుకున్నరు..
అధికారంలోకి వస్తే గొల్లకుర్మలకు రెండు లక్షలు ఇస్తామని నాడు కాంగ్రెసోళ్లు ఎన్నికల్లో ఊదరగొట్టే హామీలతో ఓట్లు దండుకున్నరు. ఇయ్యాల మాత్రం నాడు కేసీఆర్ సార్ వేసిన డబ్బులే వెనక్కి గుంజుకున్నరు. కుల వృత్తుల వారు బా గుండాలని బీఆర్ఎస్ ప్రభుత్వం సాయం చేస్తే రేవంత్ ప్రభుత్వం కక్షకట్టి, మా ఖాతాలు ఖాళీ చేసింది. కేసీఆర్ లెక్కా రేవంత్ రెడ్డి గొర్లు ఇవ్వాలి..లేదంటే మేము ఏందో చూపిస్తాం.
– కుందారపు లక్ష్మయ్య, దేవత్‌పల్లి గ్రామం, నాంపల్లి మండలం