తుంగతుర్తి, మార్చి 12 : తాము అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలను అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని అన్నారం గ్రామంలో ప్రజా సమస్యలపై సిపిఎం పోరుబాట కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఇంతవరకు ఏ ఒక్కటి అమలు చేయలేదని దుయ్యబట్టారు.
ప్రభుత్వం వెంటనే రేషన్ కార్డులను అందివ్వాలని, ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించాలన్నారు. మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ కు రూ.500 పథకం అమలుకావట్లేదని, అలాగే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500 ఇవ్వడం లేదని, రైతులకు రైతు భరోసా లేదని, సన్నధాన్యానికి ఇంకా అనేక మంది రైతులకు బోనస్ ఇవ్వలేదని ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక సమస్యలను ఎకరువు పెట్టొచ్చన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్, మండల కమిటీ సభ్యులు పల్లా సుదర్శన్, పాలబిందెల జానయ్య, బందు సోమయ్య, లింగయ్య, బాలయ్య, నర్సిరెడ్డి, సావిత్రి పాల్గొన్నారు