కోదాడ, ఏప్రిల్ 07 : కల్లబొల్లి మాటలతో ఎన్నికల్లో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అప్పులు పుట్టడం లేదంటూ నిసిగ్గుగా చెబుతూ, హామీలు అమలు పరచలేమని చేతులెత్తేసిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సోమవారం కోదాడలోని తన నివాసంలో వరంగల్లో ఈ 27న జరిగే బీఆర్ఎస్ రజోత్సవ సభ పోస్టర్ను పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజా పాలన మరచి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు ఎవరికి వారు అందినకాడికి దోచుకుంటూ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఫైలు కదలాలంటే 15 శాతం, 20 శాతం కమీషన్ ఇవ్వకపోతే మంత్రులు సంతకాలు పెట్టడం లేదని బహిరంగంగా కాంట్రాక్టర్లు నెత్తి నోరు బాదుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
ప్రతి పనికి ఒక రేటు, భవిష్యత్లో ఇక అధికారంలోకి వచ్చేది లేదనే భావనతో అవకాశం ఉన్నప్పుడే ఇబ్బడి ముబ్బడిగా దండుకుంటున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వరి పంట పొట్ట దశకు వచ్చిందని సాగునీరు అందించమని అన్నదాతలు పెట్టిన పెడబొబ్బలు వారి చెవిన పడలేదన్నారు. పంటలు ఎండి రైతులు అప్పుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన వ్యక్తే భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ సాగు నీరందించకపోవడం శోచనీయమన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్లలో విహారయాత్రలు చేస్తూ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నట్లు తెలిపారు.
ఇక రైతుబంధు, రుణమాఫీ, పంటలకు బోనస్ అసంపూర్ణంగానే అమలు చేశారన్నారు. చివరకు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ కూడా ఇచ్చే స్థితిలో లేని అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. వరంగల్లో 27న జరిగే బీఆర్ఎస్ స్వర్ణోత్సవ సభకు కోదాడ నుంచి భారీగా తరలి వచ్చేందుకు విద్యార్థి, యువత, పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ నాయకులు సుంకర అజయ్ కుమార్, కర్నిబండ సత్యనారాయణ, మండలాధ్యక్షుడు శీలం సైదులు, నర్సిరెడ్డి, తోగరు రమేశ్, జానకి, చారి, పట్టణ అధ్యక్షుడు నయీం, చింత కవిత, ఏలూరు వెంకటేశ్వరరావు, కోలా ఉపేందర్, శివాజీ, సంపేట ఉపేందర్, చంద్రం, మేదర లలిత, శివాజీ, జనార్ధన్, ఇమ్రాన్ ఖాన్, శెట్టి సురేశ్ నాయుడు, కర్ల సుందర్రావు పాల్గొన్నారు.
Kodada : హామీల అమలుపై చేతులెత్తేసిన రేవంత్రెడ్డి : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్