నల్లగొండ : రాష్ట్రంలోని కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వం పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ( Nomula Bhagath Kumar ) ఆరోపించారు. నల్లగొండ జిల్లా హలియా పట్టణంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ( BRS ) హయాంలో పూర్తయిన హాస్పిటల్‌ను కూడా ప్రారంభించలేని అసమర్థ ప్రభుత్వమని విరుచుకుపడ్డారు. కేసీఆర్ ( KCR ) ప్రభుత్వంలో నిధులు మంజూరై పనులు 30 పడకల ఆసుపత్రి ప్రారంభించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

హాస్పిటల్ ప్రారంభమైతే వైద్యం చేయించుకోవడానికి రోజుకు వందలాదిగా రోగులు వచ్చే పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. 30 పడకల సౌకర్యం అందుబాటులోకి తీసుకొని రాకపోవడంతో చుట్టుపక్కల ఐదు మండలాల ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన హాస్పిటల్‌కు కేసీఆర్ పేరు ఉంటుందనే అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభోత్సవం చేయడం లేదని విమర్శించారు.
స్థానిక ఎమ్మెల్యే ఒక్కసారి కూడా హాస్పిటల్‌ను సందర్శించిన పాపాన పోలేదని మండిపడ్డారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడంలో పూర్తిగా విఫలమయ్యారని వెల్లడించారు.తక్షణమే 10, 15 రోజుల్లో హాస్పిటల్‌ను ప్రజలకు అంకితం చేయాలని, డాక్టర్లు, సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట రాష్ట్ర మాజీ ఆప్కాబ్ చైర్మన్ యడవల్లి విజేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు రిక్కల ఇంద్రసేనారెడ్డి, కర్ణ నర్సిరెడ్డి , బీఆర్ఎస్ హాలియా పట్టణ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.