సూర్యాపేట, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో రైతన్నలు ఎన్ని తిప్పలు పడ్డారో అన్ని తిప్పలు రెండుళ్లుగా మళ్లీ ఒక్కొక్కటీ పునరావృతం అవుతున్నాయి. రైతులకు అర్ధరాత్రి విద్యుత్ సరఫరాతో ఈ తిప్పలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో రాత్రి రెండు గంటల ప్రాంతంలో సాగుకు త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దీంతో ఆ సమయంలో రైతులు మోటార్లు ఆన్ చేసేందుకు బావులు, బోర్ల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. బీఆర్ఎస్ హయాంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల ఉచితంగా విద్యుత్ సరఫరా చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 13 గంటల సరఫరానే మహాగగనమని రైతులు వాపోతున్నారు.
ప్రస్తుత సీజన్లో గత పదిహేను రోజులుగా అర్ధరాత్రి రెండు గంటల నుంచి తెల్లవారు జామున ఐదు గంటలకు త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అయితే అదృష్టవశాత్తు ఇప్పటి వరకు సరఫరాలో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకున్నా రైతులకు మళ్లీ చీకట్లలో ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల ఓ రైతు మండల విద్యుత్ అధికారికి ఫోన్ చేసి మాట్లాడితే అదంతే.. పైనుంచి ఆదేశాలు ఉన్నాయని చెబుతున్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తెలంగాణ వస్తే విద్యుత్ వైర్లపై బట్టలారేసుకోవడమేనంటూ నాటి ఉద్యమ సమయంలో సీమాంధ్ర నేతలు, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేస్తోందేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాడు రైతులకు రోజులో అప్పుడో అరగంట… ఇప్పుడో అరగంట చొప్పున ఆరు గంటలు విద్యుత్ సరఫరా కావడంతో ఒక మడికి నీరందడేమే కష్టంగా ఉండేది.
కానీ తెలంగాణను సాధించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మార్గదర్శకత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పని చేసిన గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మూడంటే మూడేండ్లలో వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్తుతో పాటు అన్ని రంగాలకు అంతే సరఫరా చేసి దేశం నివ్వెరపోయేలా చేశారు. కానీ మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల నిత్యం విద్యుత్తు కోతలు తప్పడం లేదు. ఇక రైతులకైతే ప్రభుత్వం చుక్కలు చూపించడం మొదలు పెట్టింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోజుకు 24 గంటల విద్యుత్తు సరఫరా చేయగా గత కొద్ది రోజులుగా వ్యవసాయానికి కేవలం 13 గంటలే సరఫరా చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరీ దారుణంగా అర్ధరాత్రి 2 గంటలకు త్రీ ఫేజ్ కరెంటు సరఫరా ఆన్ చేస్తుండటంతో తాము ముప్పు తిప్పలకు గురవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం అర్థరాత్రి 2 గంటలకు ఆన్ చేసి ఉదయం ఐదు నుంచి ఐదున్నర గంటల సమయంలో త్రీఫేజ్ ఆఫ్ చేసి సింగిల్ ఫేజ్ ఇస్తున్నారు. తిరిగి ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర ఐదు గంటల వరకు ఇస్తున్నారు.
అయితే అ సమయంలో కూడా తరచుగా కోతలు ఉంటున్నాయని రైతులు చెబుతున్నారు. దీనికి తోడు పలు మార్లు లోఓల్టేజీతో స్టార్టర్లు కాలిపోతున్నాయంటున్నారు. లో ఓల్టేజీ, విద్యుత్తు కోతలతో వ్యవసాయ మోటార్లు ఆఫ్ అయితే ఆన్ చేసేందుకు కుటుంబానికి ఒకరు ప్రతిరోజు డ్యూటీ చేయాల్సి వస్తోందని, ఇలాంటి పరిస్థితి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నడూ లేదని, ఏనాడూ విద్యుత్తు కోతలు చూడలేదని రైతులు అంటున్నారు.
నేడు గత్యంతరం లేక మళ్లీ ఆటో స్టార్టర్లు కొనుగోలు చేస్తున్నామని, స్టార్టర్లలో మాగ్నెట్ కాయిల్ పడిపోకుండా సపోర్టు పెడుతుండటంతో స్టార్టర్లు కాలి పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా విద్యుతు కోతల విషయమై ఓ మండలానికి చెందిన రైతు ఒకరు మండల విద్యుత్ అధికారికి ఫోన్ చేసి మాట్లాడితే ప్రభుత్వ ఉత్తర్వులు, విద్యుత్ శాఖ ఆర్డర్ అలా ఉంది. అందుకే డొమెస్టిక్ వాడకం లేని సమయంలో రైతులకు ఇస్తున్నామన్నారు. డొమెస్టిక్ కరెంటును అధికంగా వాడే సమయంలో అసలే ఇవ్వొద్దనేది ప్రభుత్వ ఆర్డర్ అని చెబుతున్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
నూతనకల్, సెప్టెంబరు 25 : త్రిఫేజ్ కరెంటు అర్థరాత్రి వస్తోంది. అది కేవలం 7 గంటలకు మించి ఉండటం లేదు. ఎప్పుడు ఇస్తరో తెలియదు. మళ్లీ కరెంటు కోతలతో కాంగ్రెస్ ప్రభుత్వం పాత కాలం తెచ్చింది. ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయకపోవడంతో పంటలకు పూర్తి స్థాయిలో నీరు అందక ఎండిపోయే పరిస్థితి వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన కరెంటు ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదు. రైతులను కాంగ్రెస్ పట్టించుకోవడంలేదు.
– కొంపెల్లి రాంరెడ్డి, రైతు, చిల్పకుంట్ల
చివ్వెంల,సెప్టెంబర్ 25: రైతులకు అర్ధరాత్రి కరెంట్ ఇస్తే మోటార్లు ఎట్లా ఆన్ చేసుకోవాలి.. పొలాలు సాగు ఎట్లా చేసుకోవాలి మొన్నటి వరకు సాగు నీటికి ఇబ్బందులు పడ్డాం..ఇప్పుడు యూరియా కోసం పడిగాపులు తప్పడం లేదు. ఒక్క బస్తా, రెండు బస్తాల యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు కరెంట్ కోతలతో ఇంకా ఎన్ని ఇబ్బందులు పడాలో తెలియట్లేదు. రైతులకు ఇచ్చే కరెంట్ ప్రతి రోజూ అర్ధరాత్రి రెండుగంటల ప్రాంతంలో ఇస్తున్నారు. ఆ సమయంలో పొలాల దగ్గరకు ఎలా వెళ్లాలి.. మోటార్లు ఎలా ఆన్ చేసుకోవాలి. పదిహేనేండ్ల కిందట కాంగ్రెస్ హయాంలో పడుతున్న ఇబ్బందులన్నీ ఇప్పుడు చూస్తున్నాం. రైతులపై ప్రభుత్వం చూ పిస్తున్న వైఖరిని ఎండగట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.
– సింగారపు కోటయ్య, రైతు, వల్లభాపురం, చివ్వెంల మండల