ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం లక్ష్యం చేరలేదు. నిర్దేశించుకున్న టార్గెట్ను అధిగమించలేదు. సుమారు 80వేల మెట్రిక్ టన్నుల వడ్ల్ల కొనుగోలుకు దూరంలో ఆగిపోయింది. మరోవైపు సన్నాలకు బోనస్ పేరుతో సర్కారు హడావుడి చేసినా.. వెయ్యి మెట్రిక్ టన్నులు మించలేదు. సర్కారు, మిల్లర్ల కొర్రీలతోనే రైతులు ప్రైవేట్లో అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఇంకా వడ్ల రూ.15 కోట్లు
రైతులకు అందాల్సి ఉన్నది. కాగా బీఆర్ఎస్ హయాంలో సజావుగా లక్ష్యానికి మించి కొనుగోళ్లు జరిగిన విషయాన్ని రైతులు గుర్తు చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి, జూన్ 10 (నమస్తే తెలంగాణ): జిల్లాలో యాసంగిలో 2.80లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. సుమారుగా 6.5లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. పౌర సరఫరాల శాఖ అధికారులు మాత్రం నాలుగున్నర లక్షల టన్నుల వడ్లు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందుకోసం జిల్లాలో 375కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కరెంట్ కోతలు, సాగునీరు లేక కరువు తాండవించడంతో వేల ఎకరాల పంటలు కండ్ల ముందే ఎండిపోయింది.
మిగిలిన పొలాలకు అష్టకష్టాలు పడి..వచ్చిన దిగుబడిని అమ్ముకుందామని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే అక్కడా ఇబ్బందులు తప్పలేదు. మొత్తానికి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. రూ.850 కోట్ల విలువైన 3.67 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఇందులో 2.06లక్షల ఎంటీల ఏ గ్రేడ్, 1.61 ఎంటీల కామన్ గ్రేడ్ కొనుగోళ్లు చేపట్టారు. 41,136 మంది రైతులను నుంచి వడ్లు సేకరించారు. మొత్తం ధాన్యాన్ని సీఎంఆర్కు తరలించారు. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ. 844 కోట్ల డబ్బులు జమ చేయగా, ఇంకా రూ. 15.6 కోట్లు పెండింగ్లో ఉన్నాయి.
సన్నాలు వెయ్యి మెట్రిక్ టన్నులే..
రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తామని గొప్పలు చెప్పుకుంటున్నది. కానీ ప్రభుత్వ లెక్కల్లో సన్నాల కొనుగోళ్లు ఆమడ దూరంలో ఉన్నాయి. జిల్లాలో సుమారు 30వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలని భావించారు. ఇందుకోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ కొనుగోలు కేంద్రాల్లో సన్నాలు అమ్మడానికి రైతులు ఆసక్తి చూపించలేదు. జిల్లాలో 970 ఎంటీల సన్నాలు మాత్రమే కొన్నారు. సర్కారు కొర్రీలు, ప్రైవేట్లో మంచి డిమాండ్ ఉండటంతో అంతా ప్రైవేట్లోనే అమ్ముకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సన్నధాన్యం కొనాలంటే 17 శాతానికి లోబడి తేమ శాతం, గింజ పొడవు 6 మి.మీ.లోపు ఉం డాలి. గింజ పొడవు, వెడల్పు చూసి మైక్రో మీటర్ ద్వారా గుర్తించాలి. ఇలా పలు కారణాలతో సర్కార్ సన్నాలపై దృష్టి సారించలేదు. చేసేదేంలేక రైతులు ప్రైవేట్ వ్యాపారులపై మొగ్గు చూపారు. ఇక అరకొరగా కొన్న సన్నాలకు బోనస్ ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి.
కారణాలు కోకొల్లలు..
యాదాద్రి భువనగిరి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో తొలు త కొంత మేర ఇబ్బందులు తలెత్తాయి. మెజారిటీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరగలేదు. కల్లాల్లో ఎక్కడ పోసిన ధాన్యం కుప్పలు అక్కడే దర్శనమిచ్చాయి. కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంతో రైతులు రోజుల తరబడి కేంద్రాల్లోనే పడిగాపులు కాశారు. రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలకు కొరత ఏర్పడింది. ప్రభుత్వం ధాన్యం కాంటా వేసినా.. తరలింపులో మాత్రం జాప్యం జరిగింది. ప్రధాన కారణంగా లారీ కొరత వెంటాడింది. మరోవైపు హమాలీల సమస్య కూడా వేధించింది. అకాల వర్షాలు రైతులను ఇబ్బందులు పెట్టాయి. అనేక కేంద్రాల్లో వాన నుంచి రక్షించుకునేందుకు సరిపడా టార్పాలిన్లు, షెడ్లు లేవు. దీంతో రైతులు బయట తక్కువ ధరకు అమ్ముకున్నారు. అంతేకాకుండా సీఎంఆర్ భర్తీ చేయాలని ప్రభు త్వం నుంచి ఒత్తిడి, కేసులు నమోదవుతాయనే భయంతో మిల్లర్లు కూడా ధాన్యం కొన్నారు.