– మందు బిళ్లలు లేక అవస్థ పడుతున్న రోగులు
– బాధ్యత లేని మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి
– సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం
– కోదాడ మండల కేంద్రంలోని పీహెచ్సీని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, జూలై 02 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ దవాఖానాలు నిరుపేద రోగుల ఆరోగ్యానికి భరోసా ఇస్తే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం కోదాడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ రోగులు పడుతున్న ఇబ్బందులను, అరకొర వసతులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అదనపు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు సకాలంలో రోగులకు వైద్య సేవలు అందించేందుకు అవసరమైన వసతులను కల్పించినట్లు తెలిపారు. అయితే రెండున్నర సంవత్సరాల కాలంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఉత్తమ్ ఈ కేంద్రానికి ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని విమర్శించారు.
దవాఖానాలో వైద్యులు సిబ్బంది కొరతతో పాటు అవసరమైన మందులు కూడా లేకపోవడంతో రోగులు వేలాది రూపాయలు వెచ్చించి ప్రైవేట్ దవఖానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి రెండున్నర ఏండ్ల క్రితం చివ్వెంల ప్రాంతానికి బదిలీ అయి వేరే వైద్యాధికారి విధులు నిర్వహిస్తున్నప్పటికీ పరిపాలన సంబంధిత అనుమతులు, నిర్ణయాలు బదిలీ అయిన వైద్యాధికారి నిర్వహించడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఈ అంశంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, జిల్లా కలెక్టర్ ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలన్నారు. వైద్యశాలల్లో ప్రసూతి అయిన నిరుపేద తల్లులకు నాడు కేసీఆర్ కిట్లు అందజేస్తే నేడు ఆ ఊసే లేదన్నారు.
ఆ పథకానికి పేరు మార్చారు కానీ లబ్ధిదారులకు మాత్రం ఏమీ అందించడం లేదన్నారు. కాన్పు అయిన పేద మహిళలు దవఖానాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. బడ్జెట్ లేదని కిట్లు పంపిణీ చేయకపోవడం దుర్మార్గమన్నారు. అలాగే కంటి వెలుగు పథకాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలి ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఖాళీ అయిన వైద్యులు, నర్సులు, లేబరేటరీ సాంకేతిక నిపుణుల పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రభలక ముందే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పకడ్బందీ చర్యలు తీసుకోకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.