కోదాడ, సెప్టెంబర్ 17 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావొచ్చినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చేతులెత్తేసిందని, అన్ని వర్గాల ప్రజలను వంచిందని బీఆర్ఎస్ కోదాడ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ పైడిమర్రి సత్యబాబు, పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్ అన్నారు. బుధవారం జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం 14 సంవత్సరాలు అవిశ్రాంత పోరాటం చేసిన ఉద్యమనేత కేసీఆర్ అని కొనియాడారు. 10 సంవత్సరాలు రికార్డ్ స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేసి రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపిన ఘనత కేసిఆర్ కు దక్కుతుందన్నారు.
అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం పాలన చేతకాక దివాలా తీసిందన్నారు. రైతులకు సరిపడా యూరియా కూడా సరఫరా చేయలేని దుస్థితి ఏర్పడిందని, ఎందుకు ఈ ప్రభుత్వాన్ని గెలిపించామా అని ప్రజలు ఈసడించుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు విరక్తి చెందారని, తిరిగి కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కర్ల సుందర్ బాబు, సంగిశెట్టి గోపాల్, అలవాల వెంకట్, మేదర లలిత, దొంగరి శ్రీనివాస్, సంపేట ఉపేందర్, కర్ల నరసయ్య, మల్లయ్య గౌడ్, ఆరిఫ్, నిస్సార్, గొర్రె రాజేశ్, బడే సాహెబ్ పాల్గొన్నారు.