చందంపేట/కొండమల్లేపల్లి, మే 28 ; కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమపథకాలన్నీ సందిగ్ధంలో పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి ఐదు నెలలు గడిచినా పథకాల అమలుపై స్పష్టత ఇవ్వడం లేదు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసి గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు చెక్ పెడుతున్నది. గొర్రెల పథకంతోపాటు కేసీఆర్ కిట్, ముఖ్యమంత్రి సహాయనిధి పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇతర పథకాలను పెంచి అమలు చేస్తామన్న హామీ కూడా అమలు కాలేదు. పింఛన్లు, రుణమాఫీ, మహిళలకు రూ.2,500, రైతు భరోసా కింద రైతులకు రూ.15వేలు వంటి హామీలు అమలుకు నోచుకోకపోవడంతో సంక్షేమ పథకాలన్నీ సందిగ్ధంలో పడినట్లయింది.
గొల్ల, కురుమల ఆర్థికాభివృద్ధి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకానికి కాంగ్రెస్ సర్కారు మంగళం పాడింది. 2018 నుంచి కొనసాగిన ఈ పథకం గొల్ల కురుమల కుటుంబాలకు ఎంతో భరోసానిచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఈ పథకానికి వందలాది మంది గొల్ల కురుమలు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల హడావుడి వల్ల పెండింగ్‌లో పడిన ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పడేసింది. నెలలు గడుస్తున్నా గొర్రెల యూని ట్లు ఇవ్వకపోవడంతో తమ డీడీలైనా తిరిగి ఇచ్చేయాలని లబ్ధిదారులు కొంత కాలంగా అధికారుల చుట్టూ తిరుగుతున్న విషయం విదితమే. ఈ క్రమం లో సబ్సిడీ గొర్రెల యూనిట్ల కోసం డీడీలు చెల్లించిన వారికి డబ్బులు తిరిగి ఇచ్చేయాలని పశు సంవర్ధక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక మండలాల వారీగా డీడీలు ఇచ్చే ప్రక్రియ షురూ కానుంది.
దేవరకొండ నియోజకవర్గంలో 7,311 మంది..
బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద గ్రామీణ ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సొసైటీల్లో సభ్యులుగా ఉన్న 18 ఏండ్లు పైబడిన వారికి గొర్రెలను అందించింది. తాసీల్దార్, ఎంపీడీఓ, మండల పశు వైద్యాధికారి సభ్యులతో లబ్ధిదారుల ఎంపిక కమిటీని నియమించింది. వీరి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి లబ్ధిదారులను లాటరీ ద్వారా ఏ, బీ గ్రూపులుగా ఎంపిక చేశారు. ఏ గ్రూపులో 7,450 మందిని ఎంపిక చేయగా.. అందులో 7వేల మంది లబ్ధిదారులకు 2020 సంవత్సరం వరకు గొర్రెలను పంపి ణీ చేశారు. 2,527 మంది లబ్ధిదారులతో బీ లిస్టును తయారు చేయగా.. అందులో 311 మందికి అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు సబ్సిడీ గొర్రెలు అందజేశారు. మొత్తం రెండు లిస్టుల్లో కలిపి 7,311 మందికి ప్రయోజనం చేకూరింది. రెండో విడుతలో గొర్రెల కోసం 2,216 మంది డీడీలు చెల్లించారు.
లబ్ధిదారుడి వాటా రూ.43,750..
ఏ గ్రూపులో మిగిలిపోయిన 150 మంది, బీ గ్రూపులో 2,527 మంది.. మొత్తం 2,977 మంది గొల్ల రురుమలకు గొర్రెలు పంపిణీ చేయాల్సి ఉన్నది. ఇందులో 2,527 మంది మాత్రమే గొర్రెల కోసం ప్రభుత్వానికి డబ్బులు చెల్లించారు. 2020 తర్వాత గొర్రెల పంపిణీని నిలిపివేసిన గత ప్రభుత్వం గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరోసారి గొర్రెల పంపిణీ ప్రక్రియ చేపట్టింది. ధరలు పెరిగాయనే ఉద్దేశంతో యూనిట్ ధరను రూ.1.75 లక్షలకు పెంచుతూ లబ్ధిదారుని వాటాగా రూ.43,750 చెల్లించాలని నిర్ణయించింది. అయితే.. తొలి విడుతలో అమలు చేసిన డీడీల విధానానికి స్వస్తి పలికింది. వాటికి బదులుగా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి యాక్సిస్ బ్యాంకు నుంచి ఆన్లైన్ అకౌంట్ నంబర్‌ను కేటాయించింది. దాంతో గొల్ల కురుమలు రూ.43,750 చొప్పున తమకు కేటాయించిన అకౌంట్లో తమ వాటా సొమ్మును జమ చేశారు. 2,527 మందిలో 311 మందికి గొర్రెలను అందించారు. మరో 2,216 మందికి గొర్రెలు ఇవ్వలేదు.
డీడీల వాపస్‌కు కసరత్తు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గొర్రెల స్కీంపై నిర్లక్ష్యం చేసింది. ప్రభుత్వ తీరుకు విసుగు చెందిన వారు తమకు గొర్రెలనైనా ఇవ్వాలి.. లేకుంటే తాము కట్టిన డీడీ డబ్బులైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గొర్రెలను ఇచ్చేందుకు ఆసక్తి చూపకపోవడం, డివిజన్లో గొల్ల, కురుమల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో డీడీలు కట్టిన వారికి డబ్బు వాపస్ ఇచ్చేయాలని పశు సంవర్ధక శాఖ ఎట్టకేలకు నిర్ణయించింది. దీంతో దేవరకొండ నియోజకవర్గంలో 2,216 మందికి సంబంధించిన రూ.9.69కోట్ల డీడీలను తిరిగి ఇచ్చేసేలా ఆ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మండలాల వారీగా అందించేలా కార్యాచరణ సిద్ధం చేసిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో ఇదే విధంగా ఇచ్చేలా సన్నద్ధమవుతున్నారు.
15 రోజుల్లోగా అందరికీ డీడీలు ఇస్తాం
గొర్రెలు పంపిణీ చేయాలని, లేకుంటే కట్టిన డీడీలనైనా వెనక్కి ఇచ్చేయాలని గొల్ల, కురుమలు గతేడాది నుంచి ఆందోళనలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా డీడీ సొమ్మును వాపస్ ఇచ్చేయాలని ఆదేశించారు. రెండో విడుతలో లబ్ధిదారులు రూ.43,750 డీడీలు చెల్లించారు. డబ్బులు కట్టి గొర్రెలు రాని వారి నుంచి విత్ డ్రా కోసం దరఖాస్తులను తీసుకొని కలెక్టర్ కార్యాలయానికి పంపిస్తాం. డీడీలు కట్టిన ప్రతి ఒక్కరికీ 15 రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాం.
– జి.నాగయ్య, మండల పశువైద్యాధికారి, కొండమల్లేపల్లి
ప్రభుత్వానికి చేతగాకనే..
కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతగాకనే గొర్రెల పంపిణీ పథకాన్ని ఆపేసింది. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే పెండింగ్‌లో పెడుతూ రద్దు చేస్తుంది. దీని వల్ల పేద కుటుంబాలు ఉపాధిని కోల్పోతున్నాయి. అవినీతి ఆరోపణలతో సంక్షేమ పథకాలను సందిగ్ధంలో పడేయడం సరికాదు. ప్రజల్లో అదరణ ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగించాలి.
– రావుల సత్యనారాయణ, గొల్ల, కురుమల సంఘం మండల ప్రధాన కార్యదర్శి, కొండమల్లేపల్లి