– దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
మాల్, మే 15 : పంటల కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం కొండమల్లెపల్లిలో నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు వెంటనే కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల కష్టాలను తెలుసుకోవాలన్నారు. రైతులు 40 రోజుల నుండి ఎదురు చూస్తున్నారని, తమ పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నట్లు తెలిపారు. కాగా రైతులను కాంగ్రెస్ సర్కార్ ముప్పుతిప్పలు పెడుతుందని దుయ్యబట్టారు. గన్నీ బ్యాగులియ్యరు, కాంటా పెట్టరు, లారీలు రావన్నారు. నెల దాటినా కొనుగోళ్ల ఊసే లేదన్నారు.
-ఎన్నికల ముందు అలవికాని హామీలిచ్చి, నమ్మించి గద్దెనెక్కినంక రైతులను నట్టేట ముంచిన రాబందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. పండించిన పంటను నెలల తరబడి కొనుగోలు చేయక, కల్లాల్లో ఉన్న ధాన్యం కళ్లప్పగించి చూస్తూ కన్నీళ్లు పెట్టిస్తుందన్నారు. పంట వేసినంక యూరియా ఇవ్వకుండా రైతులను లైన్లలో నిలబెట్టి చెప్పులరిగేలా తిప్పిన దద్దమ్మ సీఎం రేవంత్ అన్నారు. రైతన్న బతుకును ఆగం చేసిన రేవంత్ ప్రభుత్వాన్ని అదే రైతన్న కాంగ్రెస్ పార్టీని బొందపెట్టడం ఖాయం అన్నారు. ప్రభుత్వం రైతుల నుండి తరుగు పేరిట 2 కేజిల వడ్లు కట్ చేస్తున్నారు, మిల్లర్లు 3 కేజీలు అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో ఇప్పటికే అన్నదాతలకు అపార నష్టం జరిగిందన్నారు. పేరుకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు కానీ ఒక్క గింజ కూడా ప్రభుత్వం కొనడం లేదన్నారు. ఇప్పటికైనా ఎలాంటి ఆంక్షలు లేకుండా సకాలంలో వడ్లు కొనుగోలు పూర్తి చేయాలని కోరారు. వర్షాలు పడి పంట తడవకముందే యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నిద్ర లేచి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. ఢిల్లీ చుట్టూ తిరగడం మానేసి, రైతుల కష్టాలను చూడాలని, వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

‘పంట కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం’