నార్కట్పల్లి, సెప్టెంబర్ 27 : షరతులు లేకుండా రైతులందరికీ రూ.2లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నార్కట్పల్లి పట్టణ కేంద్రంలోని పోలీస్ కాంప్లెక్స్ ఆవరణలో శుక్రవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి రైతు ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీ అంశంపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితోపాటు మంత్రులు తలా ఒక ప్రకటన చేస్తున్నారని, పొంతన లేని మాటలతో రైతులు అయోమయంలో ఉన్నారని అన్నారు.
ఇప్పటి వరకు రూ.లక్షలోపు కూడా రుణమాఫీ అందరికీ కాలేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ.2లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. మూడు విడుతల్లో రుణమాఫీ అవుతుందని అనుకున్న రైతులకు చివరికి నిరాశే మిగిలిందన్నారు. ఇకనైనా రైతులకు రుణమాఫీ విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలని, అర్హులందరికీ రుణమాఫీ చేయకపోతే ఇలాంటి నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, యానా ల అశోక్ రెడ్డి, బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, కొండూరి శంకర్, వివిధ గ్రామాల మా జీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.