నల్లగొండ, నవంబర్ 14 : ‘ఫలానా కంపెనీ విత్తనాలు బాగా దిగుబడి వస్తున్నాయి ఈసారి అవి సాగు చేసి చూడు.. ఈ కంపెనీ చాలా ఏండ్లుగా మర్కెట్లో ఉంది ఇది సాగు చేస్తే బాగా కలిసి వస్తుంది’ అంటూ విత్తన కంపెనీల డీలర్లు రైతులను గందరగోళంలోకి నెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి అర్హతా లేకున్నా విత్తన దుకాణాలు పెట్టిన కొందరు డీలర్లు వ్యవసాయంపై పూర్తిస్థాయి అవగాహన లేని రైతులను లక్ష్యంగా చేసుకుని అనుకున్న విత్తనాలను అంటగట్టి ఆయా కంపెనీలు ఇస్తున్న బెన్ఫిట్స్, అధిక కమీషన్లు తీసుకుంటున్నారు. ఫలితంగా రైతులు కష్టపడి పండించిన పంట సరైన దిగుబడి రాకపోవడమో, నాణ్యత లేని కారణంగా మద్దతు ధర దక్కకపోవడమో జరుగుతున్నది. జిల్లాలో గత సీజన్లో కొన్ని కంపెనీల సన్నాలతోపాటు హెచ్ఎమ్టీ వెరైటీని మిల్లర్లు కొనుగోలు చేయలేదు. కొన్నా మద్దతు ధర ఇవ్వకపోవడంతో రైతులు ఎంతో నష్టపోయారు. ఈ విషయంపై అప్పుడు మంత్రి కోమటిరెడ్డి రంగంలోకి దిగినా మిల్లర్లు ఖాతరు చేయలేదు. అదే పరిస్థితి ఈ సీజన్లోనూ ఎదురైంది. అవే వెరైటీలను డీలర్లు రైతులకు అంటగట్టడంతో జిల్లాలో దాదాపు 50వేల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. ఇప్పుడు మిల్లర్లు ససేమిరా అనడంతో కలెక్టర్, ఇతర అధికారులు జోక్యం చేసుకున్నా మిల్లర్లు మాత్రం క్వింటాకు రూ.2,100 నుంచి 2,200కి మించి ధర పెట్టలేదు. దాంతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు.
జిల్లాలో సుమారు 600 వరకు విత్తన దుకాణాలు ఉన్నాయి. ప్రతి దుకాణ దారుడు ఫర్టిలైజర్, పెస్టిసైడ్, సీడ్ లైసెన్స్ కలిగి ఉన్నప్పటికీ వారు అనుకున్న కంపెనీల విత్తనాలను మాత్రమే విక్రయిస్తున్నారు. ప్రధానంగా విత్తన కంపెనీలు జిల్లాలో విరివిగా విస్తరించాయి. మిర్యాలగూడలో రైతులు అధికంగా మిల్లులు ఉన్న నేపథ్యంలో సన్న ధాన్యం ఎక్కువగా సాగు చేస్తున్నారు. పైగా ఆ ధాన్యం 25, 30 శాతం తేమ ఉన్నప్పటికీ కొనుగోలు చేస్తుండటంతో వాటివైపు ఆసక్తి చూపుతున్నారు. కాగా, విత్తన కంపెనీలు డీలర్లకు బంగారం, విదేశీ టూర్లు, మందు పార్టీలు, ఇతర బహుమతులు అందించి ఎన్ని ఎక్కువ విత్తనాలు అమ్మితే అంత లాభం ముట్టజెప్తున్నారు. అవన్నీ చూసుకుని రైతులను మరింతమంది రైతులకు తమకు ఎక్కువ లబ్ధి జరిగే కంపెనీల విత్తనాలను విక్రయిస్తున్నారు.
ఏ పంట సాగు ఏ సమయంలో మొదలు పెట్టాలి.. మేలైన విత్తనం ఏది వంటి విషయాలపై వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పిస్తుండాలి. ఈ నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి క్లస్టర్‌కు ఒక ఏఈఓను నియమించింది. రైతు వేదికలు నిర్మించింది. కాగా, రేవంత్ సర్కార్ రైతు వేదికలకు నిధుల విడుదల చేయకపోవడంంతో వాటిల్లో రైతు సమావేశాలు జరుగడం లేదు. అధికారులను సరైన సహకారం లేకపోవడం వల్ల రైతులు విత్తన డీలర్ల చేతిలో మోసపోతున్నారు.
ఈ సీజన్లో పంటల సాగు, విత్తనాల ఎంపిక విషయంలో రైతులను అవగాహన పరుస్తాం. గత సీజన్లో మహేంద్ర చింట్లు, కావేరి టిల్లు వెరైటీలతోపాటు హెచ్ఎంటీలను మిల్లర్లు కొనుగోలు చేయకపోవడంతో రైతులు నష్టపోవాల్సి వచ్చింది. అదే పరిస్థితి ఈ సీజన్లోనూ పునారావృతం అవడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు మద్దతు ధర కంటే తక్కువ ఇవ్వవద్దు మిల్లర్లకు చెప్పాం. మిల్లుల్లో తక్కువ ధర చెప్తే రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలి.