యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల్లో వలస నేతలకు కాంగ్రెస్ పెద్ద పీట వేస్తోంది. ఏండ్ల తరబడి పార్టీని నమ్ముకొని ఉన్న పాత కాపులకు టికెట్ల కేటాయించకుండా మొండిచెయ్యి చూపింది. ఇతర పార్టీల నుం చి కాంగ్రెస్‌లో చేరినోళ్లకే ప్రాధాన్యం ఇచ్చింది. ఇందుకు ఉదాహరణే మోత్కూరు మున్సిపాలిటీ. ఇక్కడ ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ మధ్య ఎప్పటి నుంచో కోల్డ్ వార్ నడుస్తున్నది. ఎంపీ చామల కిరణ్‌కుమార్ ప్రతిపాదించినోళ్లకు ఎమ్మెల్యే సామేల్ మొండిచెయ్యి చూపిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరు, చౌటుప్పల్, పోచంపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. శుక్రవారం నాటితో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో పట్టణాల్లో రాజకీయ వేడి రాజుకుంది. ఇప్పటికే పలు చోట్ల ప్రచారం షురూ కాగా.. ఒకటి, రెండు రోజుల్లో తారస్థాయికి చేరనుంది.
మోత్కూరులో మున్సిపాలిటీలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్ మధ్య టికెట్ల పంచాయితీ నడుస్తున్నది. చామల కిరణ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం తుంగతుర్తి. దీంతో ఆయన అనుచరులకు టికె ట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ నేతలకు టికెట్లు ఇవ్వాలని చామల పట్టుబడుతున్నారు. ఆయన ప్రతిపాదించిన అభ్యర్థులకు టికెట్లు ఖరారు చేయలేదని సమాచారం. మందుల సామేల్ మాత్రం తన అనుచరులకు టికెట్లు ఇచ్చుకుంటున్నారని ఆ పార్టీ నేతలే గుసగులాడుతున్నారు. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు మందుల సామేల్ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఆయన పాత టీంను పట్టించుకోకుండా కొత్త గ్రూపునకే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
తెలంగాణ ఏర్పాటైన తర్వాత పదేండ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోనే ఉంది. ఆ సమయంలో పెద్ద నేతలు వేరే దారి చూసుకున్నా.. ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీకి అండగా నిలిచారు. కష్టకాలంలో హస్తం పార్టీని వదిలిపెట్టకుండా ఉన్నా రు. ఇప్పుడైనా తమ న్యాయం దక్కుతుందని, కష్టానికి ఫలితం దక్కుతుందని భావించారు. ఏదో ఒక రూపంలో పదవులు వస్తాయని అనుకున్నారు. కానీ తీరా కొత్త నేతలకు టికెట్లు ఇస్తుండటంతో పాతోళ్లు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. సీనియర్లంతా నైరాశ్యంలో మునిగిపోయారు. అయితే అసలు కాంగ్రెస్ నేతలు నామినేషన్లు ఉపసంహరించుకుంటారా..? లేక రెబెల్‌గా బరిలోకి దిగి సొంత పార్టీని దెబ్బ కొడతారా అనేది వేచి చూడాలి. కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు బీఆర్ఎస్కు కలిసొచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇతర పార్టీల నుంచి వలస వచ్చేవారికి ఆహ్వానం పలికింది. దీంతో కింది స్థాయి నేతలు ఆ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వారంతా కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని మభ్యపెట్టి చేర్చుకున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రావడంతో హామీలను ఆచరణలో పెడుతున్నారు. ఏడాది, రెండేండ్ల క్రితం పార్టీలో చేరినోళ్లకు టికెట్లు ఫైనల్ చేశారు. అప్పటికే కాంగ్రెస్‌లో ఉన్నోళ్లను పరిగణలోకి తీసుకోవడంలేదు. మోత్కూరు మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా, దాదాపు 8 మందికి పారాచూట్ నేతలకే టికెట్లు ఇచ్చినట్లు తెలిసింది. భువనగిరి, పోచంపల్లి మున్సిపాలిటీల్లోనూ ఈ తరహాలోనే టికెట్లు ఖరారు చేసినట్లు తెలుస్తున్నది. దీంతో పాత కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయా వార్డుల్లో ముగ్గురు, నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీ ఫామ్‌ల కోసం పలువురు కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బీ ఫామ్‌లు పంపిణీకి సమయం ఉండటంతో ఎవరికి ఇవ్వాలో తెలియక పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది.