యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ)/సంస్థాన్ నారాయణపురం: గిరిజన భూములపై కాంగ్రెస్ సర్కారు కన్ను పడింది. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న లంబాడీల భూములను కొల్లగొట్టేందుకు స్కెచ్ వేసింది. పోలీసు బెటాలియన్ పేరుతో పేదల పొట్టగొట్టే పన్నాగానికి తెరతీసింది. గుట్టుచప్పుడు కాకుండా పని కానిచ్చేస్తున్నది. కనీసం రైతులకు కూడా సమాచారం ఇవ్వకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది. ఏకంగా గిరిజనుల భూములను యాదాద్రి భువనగిరి జిల్లాలో బెటాలియన్‌కు కేటాయించినట్లు తెలుస్తున్నది. అధికారులు సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో గిరిజనులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాటకు సిద్ధమవుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండలంలో గిరిజనులు అధిక సంఖ్యలో ఉంటారు. నారాయణపురం మండలం కేంద్రంలోని సర్వే నంబర్ 255లో మొత్తం 144 ఎకరాల భూమి ఉంది. దీనిలో ఇప్పటికే 11 ఎకరాలను సింగిల్ విండో గోదాం నిర్మాణం, సబ్ మార్కెట్ యార్డు కోసం కేటాయించారు. రెండున్నర ఎకరాల్లో గాంధీనగర్ తండాకు చెందిన గిరిజనులు ఇండ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. 1970 నుంచి 2001 వరకు ఆయా ప్రభుత్వాలు అసైన్మెంట్ కమిటీ ద్వారా 130 నిరుపేదలు, గిరిజనులకు లావణి పట్టాలను పంపిణీ చేశారు. నాడు పూర్తిగా రాళ్లు రప్పలతో నిండిన ఎర్రమట్టి గుట్టను పేదలు లక్షల ఖర్చు పెట్టి ఏళ్ల తరబడి చదును చేసి వ్యవసాయ యోగ్యంగా మార్చుకున్నారు. అందులో ఉలువలు, కందులు, పెసర్లు సాగు చేస్తూ వస్తున్నారు.
చేతికందిన పంటలతో జీవనం సాగిస్తున్నారు. కొందరు పశువులు, గొర్రెలు, మేకలు మేపుతూ జీవిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత వీరిలో 56 మందికి బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పట్టాలు అందించింది. మిగతా వారికి కొత్త బుక్‌లు ప్రాసెస్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగుకు యోగ్యంకాని భూములంటూ 84.25 ఎకరాలను కొత్తగా ఏర్పాటు చేయనున్న పోలీసు బెటాలియన్‌కు కేటాయించినట్లు తెలుస్తున్నది. హైదరాబాద్‌కు దగ్గరలో ఉండటంతో అనువుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. త్వరలో పోలీసు పోస్టుల భర్తీ ఉంటుందని, వారిని బెటాలియన్‌లో సర్దుబాటు చేస్తారనే ప్రచారం జరుగుతున్నది.
దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం అప్పనంగా లాగేసుకోవాలని ప్రయత్నిస్తుండటంతో పోరుబాటకు గిరిజనులు సన్నద్ధమవుతున్నారు. భూములు పోతే జీవనాధారం కష్టమవుతుందని, బతికేదెలా అని వాపోతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే రాచకొండ ప్రాంతంలో ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుకు కాంగ్రెస్ సర్కారు ప్రయత్నించి విఫలమైందని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు కంటే ముందే ఇక్కడ క్షిపణి ప్రయోగ స్థలానికి నారాయణపురం మండలంలో భూమి కేటాయించారు.
స్థల పరిశీలనకు వచ్చిన అధికారులపై గిరిజనులు పెద్ద ఎత్తున దాడులకు దిగారు. వారు ఒంటిపై కిరోసిన్ పోసుకోవడంతో పాటు స్థల సేకరణకు వచ్చిన అధికారులపై కూడా కిరోసిన్ పోసి తీవ్రంగా వ్యతిరేకించారు. స్థలం ఇచ్చేది లేదంటూ వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో చేసేదేంలేక సదరు సంస్థ వెనక్కిపోయింది. ఇలా కాంగ్రెస్ కుట్రలను నాడే రైతులు, గిరిజనులు తిప్పికొట్టిన ఘటనలను యాదికి తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వంపై కొట్లాడతామని హెచ్చరిస్తున్నారు. రాచకొండలోని భూములు ఇచ్చుకోవాలని, తమ భూముల్లో బెటాలియన్ వద్దని డిమాండ్ చేస్తున్నారు.
సాధారణంగా ప్రభుత్వానికి భూములు అవసరమైతే భూసేకరణకు నిబంధనల ప్రకారం ముందుకెళ్తారు. ముందస్తుగా సదరు రైతులకు నోటీసులు జారీ చేస్తారు. భూసేకరణకు గెజిట్ నోటిఫికేన్ విడుదల చేస్తారు. రైతులతో సమావేశాలు, చర్చలు జరుపుతారు. పరిహారం, ఇతర అంశాలను వివరిస్తారు. సంస్థాన్ నారాయణపురంలో మాత్రం ఏదీ సరిగ్గా నడుస్తున్నట్లు కనిపించడం లేదు. ఏది అడిగినా తమకేం తెలియదని అధికారులు దాటవేస్తుండటం గమనార్హం. గతంలోనూ పాస్‌బుక్ ఉండగా, 56 మందికి కొత్త పాస్‌బుక్‌లు వచ్చాయి. మరికొంత మందికి రావాల్సి ఉంది. ఒకవేళ ప్రభుత్వ అవసరాల కోసం తీసుకోవాల్సిన అవసరమున్నా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. వీటిపై అసలు స్పష్టతే లేదు. పోలీసు అధికారులు మాత్రం సంస్థాన్ నారాయణపురంలోనే బెటాలియన్ అని ప్రకటించారు. దీంతో ఏం జరుగుతుందో తెలియక గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చి చేతులు దులిపేసుకున్నారనే ఆరోపణలున్నాయి.
రాళ్లురప్పలుగా ఉన్న భూమిని చదును చేసుకొని తరతరాలుగా సాగు చేసుకుంటున్నాం. గిరిజనుల భూములు లాక్కొని పోలీసు బెటాలియన్‌కు కేటాయించడం తీవ్ర అన్యాయం. పట్టాలు ఇచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఉన్న భూములను గుంజుకోవడం హేయమైన చర్య. ప్రాణాలు పోయినా సరే పోలీసు బెటాలియన్ కోసం సెంట్ భూమి కూడా వదులుకోం.
-మెగావత్ నరసింహ, బాధితుడు
సంస్థాన్ నారాయణపురంలో 255 సర్వే నంబర్లోని భూముల పట్టాలు అందించి రైతులందరికీ న్యాయం చేస్తామని పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఎన్నికలు ముగిశాక పోలీసు బెటాలియన్‌కు కేటాయిస్తున్నామని చెప్పడం ఎంతవరకు సమంజసమో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమాధానం చెప్పాలి. పట్టాల కోసం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోరాడితే.. రాజగోపాల్‌రెడ్డి బెటాలియన్‌కు కేటాయించడం అన్యాయం.
-చిలువేరు అంజయ్య,సంస్థాన్ నారాయణపురం