వానకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్ల ప్రారంభంపై సందిగ్ధం నెలకొంది. ఇవ్వాళ, రేపు అంటూ గడుపుతున్న అధికార యంత్రాంగం తీరుతో రైతుల్లో అసహనం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే జిల్లాలో ఆయా కేంద్రాల్లో ధాన్యం పోసిన రైతులు కొనుగోలు చేయాలని ఎదురు చూస్తున్నప్పటికీ కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సన్నాలకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు రూ.500బోనస్ ఇస్తామని ప్రకటించడంతో సన్నాలు, దొడ్ల కోసం
వేర్వేరుగా కేంద్రాలు ఏర్పాటు చేసే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.
సన్నాలు, దొడ్లు గుర్తించే పని వ్యవసాయ యంత్రాంగానికి పని అప్పగించగా, ఎలా గుర్తిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11.77 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం సాగు కాగా ఆయా జిల్లాల్లో 29.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో సన్నాలు 9.86 లక్షల మెట్రిక్ టన్నులు, దొడ్డు ధాన్యం 20 లక్షల మెట్రిక్ టన్నులు రానుంది. వీటి కొనుగోలుకు ఐకేపీ, పీఏసీఎస్, మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో 965 కేంద్రాలు ప్రారంభించనున్నామని ప్రకటించిన అధికార యంత్రాంగం ఇప్పటి వరకు చేయకపోవడం గమనార్హం.
ఏటా అక్టోబర్ 1 నుంచే ప్రారంభం
సాధారణంగా ఏటా అక్టోబర్ 1 నుంచే వానకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తారు. ఈ సారి మొదటి వారం పూర్తవుతున్నప్పటికీ నేడు, రేపు అని అధికార యంత్రాంగం కాలయాపన చేస్తున్నది. దాంతో కేంద్రాలకు ఇప్పటికే ధాన్యం తీసుకొచ్చిన రైతులు ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ సారి మద్దతు ధర క్వింటాకు గ్రేడ్-1 రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 నిర్ణయించగా.. సన్నాలకు మరో రూ.500 అదనంగా ఇవ్వనున్నారు. సన్నాలు, దొడ్లకు వేర్వేరుగా కేంద్రాలు ఏర్పాటు చేసే యోచనలో అధికార యంత్రాంగం ఉండగా.. అవి ఎక్కడెక్కడ ప్రారంభించాలో క్లారిటీ లేకుండా పోయింది.
ఉమ్మడి జిల్లాలో 9.86 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 29.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి ఆయా ప్రాంతాల్లో 9.86 లక్షల ఎకరాల్లో సన్నాలు, 20 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది. నల్లగొండ జిల్లాలో 5.15 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 12 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రానుంది. ఇందులో ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సన్నాలు రానుండగా ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దొడ్డు ఉండనుంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో 2.82 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా 6.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సన్నాలు 70వేల మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 5.70 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రాలకు రానుంది. సూర్యాపేట జిల్లాలో 4.82 లక్షల ఎకరాల వరి సాగు కాగా 11 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 2.16 మెట్రిక్ టన్నుల సన్నాలు, 9లక్షల మెట్రిక్ టన్నుల దొడ్లు రానున్నాయి.
సన్నాల గుర్తింపుపై ఆందోళన
సన్న ధాన్యానికి క్వింటాకు రూ.500 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో అసలు సన్నాలు ఎలా గుర్తిస్తారనే దానిపై అన్నదాతలు ఆందోళనలో పడ్డారు. ప్రభుత్వం మొత్తంగా 33 రకాలకు సంబంధించి సన్నాలకు అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి తెప్పించిన రెండు మిషన్లతో క్యాలిబర్ చేయనున్నారు. ఈ మిషన్ ఆధారంగా ధాన్యం పొడవు, మందం ఆధారంగా సన్నాలా, దొడ్లా అనేది గుర్తించనున్నారు. ఇందుకోసం వేర్వేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఎలా ఉంటదనేది చూడాల్సి ఉంది. ఈ మిషన్ ఆధారంగా సన్నాలు అని తేలితే రూ.55 బోనస్ క్వింటాకు రానుండగా.. దొడ్లు అయితే గ్రేడ్-1 లేదా సాధారణ రకంగా గుర్తించనున్నారు.
మిల్లుల్లో అంతకు మించి ధర
ప్రభుత్వం ఈ సారి సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించినప్పటికీ మిల్లుల్లో అంతకు మించి ధర వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. సాధారణంగా 17శాతం తేమ ఉంటేనే మార్కెట్లో ధాన్యం కొనుగోలు చేస్తారు. మిల్లుల్లో 25 నుంచి 30శాతం తేమ ఉన్నప్పటికీ ప్రస్తుతం క్వింటాకు రూ.2,800 నుంచి రూ.2,900 వరకు కొనుగోలు చేస్తున్నట్లు రైతులు అంటున్నారు. ధాన్యం ఆరబోస్తే తేమశాతం తగ్గి నష్టం వస్తున్నందున ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చినా ఉపయోగం ఏం లేదన్న వాదన వస్తున్నది. ధాన్యం గుర్తింపు విషయంలో ఎలా ఉంటుందనే దానిపై సందిగ్ధం నెలకొంది.
మిషన్ల ద్వారానే సన్న ధాన్యం గుర్తింపు
జిల్లాలో ఈ వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నాం. సన్న, దొడ్డు ధాన్యం కోసం వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఆయా కేంద్రాల్లో సన్నాలు గుర్తించేందుకు ప్రత్యేకంగా మిషన్లు అందుబాటులో ఉంచాం. ఆయా మిషన్ల ద్వారా పొడవు, మందం బట్టి సన్నాలా, దొడ్లా అనేది గుర్తించవచ్చు. రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలి.
-పాల్వాయి శ్రవణ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి, నల్లగొండ