మర్రిగూడ : మర్రిగూడ పీఏసీఎస్ పరిధిలో 305మంది రైతులు రూ.1.55 కోట్ల పంట రుణం తీసుకున్నారు. మొదటి విడుతలో లక్షలోపు రుణం తీసుకున్న 122మంది రైతుల జాబితాను ప్రభుత్వం ప్రకటించగా 67 మందికే మాఫీ అయ్యింది. ఇందులో కొందరు రైతులకు రూ.2వేల నుంచి 15వేల వరకే మాఫీ అయినట్లు, మరికొంత మంది రైతులకు రుణమాఫీ జాబితాలో పేర్లు కూడా లేవని తెలుస్తున్నది. మాఫీ కానీ రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. రుణమాఫీకి సంబంధించిన వివరాలను పీఏసీఎస్ అధికారులు ఆన్లైన్లో పొందుపర్చకపోవడంతోనే ఈ తప్పిదం జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు.
కాళ్లు మొక్కినా పట్టించుకుంటలేరు
మర్రిగూడ సొసైటీలో నా భర్త శంకర్ రూ.50వేల లోన్ తీసుకున్నాడు. ఆయన చనిపోయిండు.లోన్ మాఫీ కాలేదని అధికారులు అంటున్నరు. మర్రిగూడ సొసైటీ అధికారులు గుర్రంపోడ్ పొసైటీకి వెళ్లి చెక్ చేసుకో అంటే అక్కడికి వెళ్లిన. గుర్రంపోడ్ అధికారులు అగ్రికల్చర్ ఆఫీస్కు వెళ్లమన్నరు. ఇలా అటూ ఇటూ తిప్పుతున్నరు. ఏడ్చినా, కాళ్లు మొక్కుతున్నా పట్టించుకుంటలేరు. భర్త లేక కుటుంబ భారమంతా నా మీదనే ఉంది. కూలీ పనికెళ్తేనే పూట గడుస్తుంది. నేను నా పిల్లలు బతికేదే కష్టంగా ఉంది. లోన్ మాఫీ కాకపోతే ఏడ తెచ్చి అప్పు తీర్చాలె.
-పగడాల సైదమ్మ, మర్రిగూడ
నాకు 15వేలు కూడా మాఫీ కాలేదు
నేను మర్రిగూడ సొసైటీ బ్యాంకులో 15వేల లోన్ తీసుకున్నా. గవర్నమెంట్ మాఫీ అనగానే సొసైటీకి వెళ్లి చెక్ చేసుకున్నా. 4వేల రూపాయలే మాఫీ అయ్యింది. ఏం అర్థం కాలేదు. మిగతావి ఎందుకు మాఫీ కాలేదని అధికారులకు అడిగితే సరైన సమాధానం చెప్తలేరు. ఏదో కంప్యూటర్ మిస్టేక్ జరిగిందని అంటున్నరు. కంగారు పడొద్దు, పైకి లిస్టు పంపిస్తం, మాఫీ అయితదని అంటున్నరు.
-గ్యార నర్సింహ, మర్రిగూడ