వానకాలం సీజన్ ధాన్యం కొనడానికి జిల్లాలో సెంటర్లు ప్రారంభించి నెల పదిహేను రోజులయ్యింది. 7.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యానికి ఇప్పటి వరకు కొన్నది 1.19లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. ఇంకా సెంటర్లల్లో 68వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నట్టు సివిల్ సప్లయ్ అదికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా నాన్ఆయకట్టులో అంటే నల్లగొండ, నకిరేకల్, మునుగోడులో ఇప్పటికే కోతలు పూర్తి కాగా ఆయకట్టు ప్రాంతాలైన మిర్యాలగూడ, సాగర్‌తోపాటు దేవరకొండలో ఇంకా పూర్తి కాలేదని, జిల్లాలో మొత్తంగా ఇప్పటి వరకు 60శాతం కోతలు పూర్తి కాగా ఇంకో 40శాతం అదీనూ సన్నాలు మాత్రమే ఉన్నట్టు వ్యవసాయ శాఖ చెప్తున్నది. అంటే మహా అంటే చివరి వరకు మూడు లక్షల వరకు అధికార యంత్రాంగం కొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ లెక్కలు అంచనాలు తప్పడానికి కారణం సెంటర్ల ప్రారంభంతోపాటు మిల్లుల ట్యాగింగ్ ఆలస్యం కావడం వల్లేనని సంబంధిత శాఖల అధికారులు అంటున్నారు. ఈ తతంగం పూర్తయ్యే వరకే నల్లగొండ, నకిరేకల్ రైతులు పూర్తిగా తమ ధాన్యాన్ని మిల్లుల్లో అమ్మారని ఆ శాఖల యంత్రాంగం అనడం గమనార్హం.
– నల్లగొండ, నవంబర్ 19
నల్లగొండ జిల్లాలో ఈ వానకాలం సీజన్లో 5.20లక్షల ఎకరాల్లో సన్న, దొడ్డు రకం వరి సాగు చేశారు. ఈ నేపథ్యంలో మొత్తంగా 12.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా స్థానిక అవసరాలు పోను ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా 7.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాధారణంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అక్టోబర్-1నుంచే సెంటర్లు ప్రారంభిస్తుండగా ఈ సారి అక్టోబర్-10 తర్వాత అది కూడా విడుతల వారీగా..మొత్తంగా 340 కేంద్రాలు ప్రారంభించారు. ఆయా కేంద్రాల్లో దొడ్డు ధాన్యం 1.18లక్షల మెట్రిక్ టన్నులు, సన్న ధాన్యం 1179 మెట్రిక్ టన్నుల కొనుగోలు చేశారు. ఇంకా ఆయా సెంటర్లల్లో తేమ శాతం రాని ధాన్యం కుప్పలు మరో 68వేల మెట్రిక్ టన్నులు ఉన్నట్లు అధికారులు అంటున్నారు.
నాన్‌ఆయకట్టు ప్రాంతాలైన నల్లగొండ, నకిరేకల్, మునుగోడు నియోజక వర్గాలకు చెందిన రైతులు ఆదిలోనే మిల్లుల్లో దొడ్డు ధాన్యం అమ్మినట్లు పలు శాఖల అధికారులు, రైతులు అంటున్నారు. జిల్లాలో 60శాతం కోతలు దొడ్డు ధాన్యం పూర్తి అయినప్పటికీ ఇప్పటి వరకు 1.19లక్షల మెట్రిక్ టన్నులే కొన్నారు. దొడ్డు ధాన్యమే పలు కారణాలతో సెంటర్లకు తేని రైతులు సన్న ధాన్యం ఎలా తెస్తారనేదే ప్రశ్న. ఈ కారణాల నేపథ్యంలో 7.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్ల లక్ష్యానికి నాలుగు నుంచి ఐదు లక్షలకు మించదని తెలుస్తుంది.
జిల్లాలో ఈ సీజన్లో 5.20లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా అందులో 2.50లక్షల ఎకరాల్లో సన్నాలు, 2.70లక్షల ఎకరాల్లో దొడ్డు రకాలు సాగు చేశారు. ఇప్పటికే దొడ్డు ధాన్యం పూర్తిగా కోయగా, సన్నాలు మాత్రం ఇంకో 40 శాతం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంటున్నది. ప్రధానంగా నాన్ ఆయకట్టు ప్రాంతాలైన నల్లగొండ, నకిరేకల్, మునుగోడుతోపాటు దేవరకొండలో దొడ్డు రకం సాగు ఎక్కువగా అవుతుండగా నాగార్జున సాగర్, మిర్యాలగూడలో సన్న రకం సాగవుతుంది. ప్రస్తుతం సాగర్, దేవరకొండ, మిర్యాలగూడలోనే వరి కోతలు 40శాతం మేరకు ఉన్నాయి. సాధారణంగా దొడ్డు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో, సన్న ధాన్యాన్ని మిల్లుల్లో అమ్ముతారు.
ఇప్పటికే దొడ్డు ధాన్యం కోతలు 90శాతం పూర్తి కాగా పది శాతం మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు కొన్నది..సెంటర్లల్లో ఉన్నదానితో పాటు తప్ప కోత దశలో ఉన్న ఆ పది శాతం దొడ్డు ధాన్యం మాత్రమే సెంటర్లకు వచ్చే అవకాశం ఉన్నది.. ఇక సన్నాలకు మిల్లుల్లో రూ.2300లకు పైగా మిల్లుల్లోనే అది కూడా 25 నుంచి 30శాతం తేమ శాతం ఉన్న ధాన్యానికి ఇస్తున్నారు. సెంటర్లల్లో సన్న ధాన్యం పోయాలంటే 17శాతం వచ్చే వరకు ఆరపెట్టడం ప్రయాసతోపాటు ఆరబెట్టడం వల్ల 20 నుంచి 25శాతం నష్టం జరుగుతుందని.. అందుకే మిల్లుల్లోకి తీసుకెళ్తున్నట్లు రైతులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కోస్తున్న సన్నాలు ఏ మేరకు సెంటర్లకు వస్తాయో చూడాలని సంబంధిత శాఖల అధికారులు అంటున్నారు. ఏదేమైనా చివరినాటికి కూడా మూడు లక్షల టన్నులు మించి కొనుగోళ్లు జరిగే అవకాశం ఉండదని పలువురి అంచనా.
జిల్లా వ్యాప్తంగా 340 కేంద్రాలు ప్రారంభించి ఇప్పటివరకు 1.19లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఇంకా ఆయా సెంటర్లల్లో సుమారు 70వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నందున ఎప్పడికప్పుడు తేమ శాతం చూసి కొనుగోలు చేస్తున్నాం. ఇంకా కోతలు కూడా పూర్తి కానుందున రైతులు సెంటర్లకు తెచ్చిన ప్రతి గింజా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు కూడా ఇప్పటి వరకు రూ.276కోట్లకు గానూ రూ.175కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం.
-హరీశ్, సివిల్ సప్లయ్ డీఎం, నల్లగొండ