రామన్నపేట, ఫిబ్రవరి 9 : పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలని, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రామన్నపేట మండలంలోని జనంపల్లిలో గల బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ప్రిన్స్‌పాల్ వైఖరిని నిరసిస్తూ ధర్నా చేశారు. గురుకుల సొసైటీ నిబంధనల ప్రకారం ప్రతినెలా రెండో ఆదివారం తల్లిదండ్రులకు తమ పిల్లలను కలిసే అవకాశం కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి తమ పిల్లలను కలిసేందుకు తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చారు. దీంతో పాఠశాల సమస్యలు, విద్యార్థుల ఇబ్బందులను తెలిపేందుకు కొందరు తల్లిదండ్రులు ప్రిన్స్‌పాల్ రాజాను కలిశారు.
ఈ క్రమంలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల గురించి ప్రిన్సిపాల్‌కు తెలిపే సమయంలో వాగ్వాదం జరిగింది. పాఠశాలలో నీటి కొరతతో అర్ధరాత్రి స్నానాలు చేయాల్సి వస్తుందని, బాత్రూమ్పై రేకులు లేక పోవడంతో కోతులు దాడులు చేస్తూ గాయ పరుస్తున్నాయని, తరగతి గదుల్లో ఫ్యాన్లు లేక పోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తల్లిదండ్రులు వాపోయారు. బాత్రూమ్లలో కంపువాసన కొడుతుందన్నారు. నెలనెలా తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేయడం లేదని ఆరోపించారు. పిల్లలు అనారోగ్యం పాలైతే పరిస్థితి విషమించే వరకు తమకు సమాచారం అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డార్మిటరీలు లేక పోవడంతో తరగతి గదుల్లోనే విద్యార్థులు పడుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్, సిబ్బందికి ఫోన్ చేసినా స్పదించరని ఆరోపించారు. అనంతరం పాఠశాల ప్రధాన ద్వారం వద్ద ప్రిన్సిపాల్ అందుబాటులో ఉంటూ, నిరంతరం పర్యవేక్షిస్తూ నెల నెల పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయాలని సమస్యలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆందోళన చేపట్టారు.
320 మందికే వసతులు : ప్రిన్సిపాల్
గురుకుల పాఠశాలలో మొత్తం 585 మంది విద్యార్థినులు ఉన్నారని, 320 మందికి మాత్రమే సరిపడా వసతులు ఉన్నాయని ప్రిన్సిపాల్ రాజా వివరణ ఇచ్చారు. పాఠశాలలో నీటి సమస్య, కోతుల సమస్య ఉందని, విద్యార్థుల ఆరోగ్య విషయంపై తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లున్నట్లు తెలిపారు. విద్యార్థుల క్రమశిక్షణ, చదువు పట్ల కఠినంగా వ్యవహరిస్తాననే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.
విద్యార్థులను ఖైదీల్లా వ్యవహరిస్తున్నారు
పిల్లలను కలుస్తామని వస్తే కలువకుండా గేటు బయటి నుండే మాట్లాడమని ఖైదీల్లాగా వ్యవహరిస్తున్నారు. పిల్లలు అనారోగ్యం పాలైతే సమాచారం కూడా ఇవ్వరు. బాత్రూమ్లకు పైకప్పులు లేక పోవడంతో కోతులు ఎగపడుతున్నాయి. బాత్రూమ్లు దుర్వాసనతో అపరిశుభ్రంగా ఉంటాయి.
– రవి నాయక్, దామరచర్ల, విద్యార్థిని తండ్రి
గతిలేక చేర్పించినట్లుంది
పాఠశాలలో గతిలేక చేర్పించినట్లు ఉంది. చదువు సరిగ్గా లేదు. క్లాస్ రూములోనే చదువుకోవాలి.. క్లాస్ రూములోనే పడుకోవాలి.. ఫ్యాన్లు లేవు. నీళ్లు రాక పోవడంతో అర్ధరాత్రి రెండు గంటలకు స్నానం చేయాల్సి వస్తున్నది. పేరెంట్స్ మీటింగ్ ఇప్పటివరకు పెట్టలేదు. విద్యార్థులు మంచాలు లేక పోవడంతో కిందనే పడుకోవాల్సి వస్తున్నది.
– ప్రశాంతి, ఇస్కిళ్ల, విద్యార్థిని తల్లి