RajaRajeshwara Jathara | కుభీర్, ఫిబ్రవరి 16: నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి (బీ) గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఐదు రోజుల వేడుకలు, జాతర ఆనవాయితీగా వస్తోంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రాధాన్యత కలిగి ఉంది.
సోమవారం ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, అర్చన, పూజలతో పాటు భజన కార్యక్రమాలు ఉంటాయి. మంగళవారం ఉదయం చోండిలోని జోడాగుల వద్ద ఉత్సవ విగ్రహాలకు మహాభిషేక స్నానమాచరించే కార్యక్రమం, ఇదే రోజు అర్ధరాత్రి ఆలయ ప్రాంగణంలో “శివపార్వతుల కళ్యాణం” అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. 17వ తేది బుధవారం రాత్రి అత్యంత భక్తి శ్రద్దలతో స్వామి వారికి “అంబళ్ల సమర్పణ” ఉంటుంది. మట్టి కుండల్లో వండుకుని తెచ్చిన నైవేద్యం శిరస్సుపై పెట్టుకుని దంపతులు ఆలయం చుట్టూ ఐదు ప్రదక్షణలు చేసి స్వామివారికి సమర్పిస్తారు. 9వ తేదీ గురువారం కుస్తీ పోటీలు, మహా అన్న ప్రసాద వితరణ జరుగనున్నాయి. అదే రోజు రాత్రి 12 గంటలకు “నాగవెల్లి” కార్యక్రమంతో వేడుకలు ముగుస్తాయి. ఉత్సవాల్లో భాగంగా జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది.