– ఆదివాసీ సంఘం దుమ్ముగూడెం మండలాధ్యక్షుడు సోయం కామరాజు
దుమ్ముగూడెం, జూలై 28 : ఆదివాసీ సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆగస్టు 9న ఘనంగా నిర్వహించాలని, ఇందుకు సంబంధించి గురువారం జరిగే ముఖ్య నాయకుల సమావేశంలో సభ నిర్వహణపై చర్చించడం జరుగుతుందని ఆదివాసీ సంఘం దుమ్ముగూడెం మండలాధ్యక్షుడు సోయం కామరాజు అన్నారు. మంగళవారం లక్ష్మీనగరంలో స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండలంలోని ఆదివాసీ విద్యార్ధులు, యువత, మేధావులు, పెద్దలు, మహిళలు, ఉద్యోగస్తులు వివిధ రంగాల ఆదివాసీలందరూ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొనాలని కోరారు. మండల కేంద్రమైన లక్ష్మీనగరంలో ఉదయం ఆదివాసీ జెండా ఆవిష్కరణతో పాటు గ్రామంలో ఆదివాసీలతో ప్రదర్శన ఉంటుందని తెలిపారు. గురువారం జరిగే సమావేశంలో అన్ని అంశాలపై చర్చించి తగిన విధంగా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కొమరం దామోదర్‌రావు, సరియం కోటేశ్వరరావు పాల్గొన్నారు.