Couple Friendly | వాలెంటైన్స్ డే వీకెండ్ సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మూడు సినిమాలు విడుదల కాగా, అందులో ప్రేమకథా చిత్రం కపుల్ ఫ్రెండ్లీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అదే సమయంలో విడుదలైన ‘ఫంకీ’, సీతా పయనం సినిమాలు మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ, ‘కపుల్ ఫ్రెండ్లీ’ మాత్రం యువతను, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకర్షిస్తూ మంచి కలెక్షన్లను రాబడుతోంది.ఈ చిత్రంలో యువ హీరో సంతోష్ శోభన్, మిస్ ఇండియా ఫైనలిస్ట్‌గా గుర్తింపు పొందిన మానస వారణాసి జంటగా నటించారు. తమిళ దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఫీల్‌గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌కు కనెక్ట్ కావడంతో సోషల్ మీడియాలో కూడా మంచి బజ్‌ను క్రియేట్ చేస్తోంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌తో కలిసి నిర్మాత ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్లో ధీరజ్ మొగిలినేని ఆసక్తికర ప్రకటన చేశారు. ‘కపుల్ ఫ్రెండ్లీ’లో కనిపించిన సంతోష్ శోభన్ – మానస వారణాసి జోడీతో మరో లవ్ స్టోరీ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలిపారు. ఈ కొత్త చిత్రాన్ని వచ్చే ఏడాది వాలెంటైన్స్ సందర్భంగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నామని వెల్లడించారు.
అయితే ఈ కొత్త ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించేది ఎవరు అన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. మరోసారి యూవీ క్రియేషన్స్‌తో కలిసి తానే ఈ సినిమాను నిర్మిస్తానని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో ప్రేక్షకుల్లో ఆ జోడీపై మరోసారి ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ‘కపుల్ ఫ్రెండ్లీ’ సక్సెస్‌తో ఉత్సాహంగా ఉన్న చిత్రబృందం, అదే జోష్‌తో కొత్త లవ్ స్టోరీకి సిద్ధమవుతుండటం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. ప్రేమకథలంటే ఇష్టపడే ప్రేక్షకులకు ఇది మరో గుడ్ న్యూస్‌గా మారింది.