తొర్రూర్ : తొర్రూరు మున్సిపల్ కార్యాలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇవాళ మున్సిపల్ ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్ ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కౌన్సిలర్లు, ముఖ్య నేతలు అక్కడికి చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఎంపీ కడియం కావ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కార్యాలయానికి చేరుకున్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కాసేపట్లో ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. దాంతో రెండు పార్టీల నేతలు పోటాపోటీగా నినాదాలు చేస్తున్నారు.
తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉండగా.. 9 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఏడు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దాంతో ఇక్కడ ఎక్స్ అఫిషియో మెంబర్ల ఓట్లు కీలకంగా మారాయి.