నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన జీవో 9 చెల్లదని తెలిసీ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మభ్యపెడుతోందంటూ బీసీ సంఘాల నేతలు ఫైరయ్యారు. కాంగ్రెస్‌తో పాటు ప్రభుత్వ పెద్దలకు అన్నీ తెలిసే బీసీలను మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన బిల్లులను కేంద్రం 9వ షెడ్యూల్లో చేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 చెల్లదని తెలిసి కూడా డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
గురువారం జీవో నెంబర్ 9పై రాష్ట్ర హైకోర్టు స్టే ఇవ్వడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పైనా స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేయక తప్పలేదు. ఈ పరిణామాలతో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల నేతలు, ఆ వర్గాలకు చెందిన ప్రముఖులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. శుక్రవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆందోళనలకు దిగారు. ప్రధాన పట్టణ కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లోనూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. బీసీ సంఘాల పిలుపు మేరకు నల్లగొండ జిల్లా కేంద్రంతో పాటు ముఖ్య పట్టణాల్లోని విద్యా సంస్థలన్నీ స్వచ్ఛందంగా సెలవు ప్రకటించుకున్నాయి.
బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. 9 జీవోపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో బీసీ సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో శుక్రవారం పట్టణ, మండల కేంద్రాల్లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనలు కొనసాగాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలో గురువారం రాత్రే బీసీ విద్యార్థి సంఘం, విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. క్లాక్‌టవర్‌లోని పూలే విగ్రహం వద్ద నిరసనకు దిగి బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధిపత్య శక్తులు బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
మునుగోడులో బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద రోడ్డుపై బైఠాయించారు. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. తక్షణమే ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిర్యాలగూడలోని రాజీవ్ చౌరస్తా వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బీసీ రిజర్వేషన్ల జీవోను వ్యతిరేకిస్తున్న వారి దిష్టిబొమ్మను దహనం చేశారు. బీసీ రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలని డిమాండ్ చేశారు. తిరుమలగిరి పట్టణ కేంద్రంలో బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి.
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ రాస్తారోకో చేపట్టారు. కామారెడ్డి డిక్లరేషన్‌కు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలని డిమాండ్ చేశారు. నూతనకల్లోనూ బీసీ సంఘాల ఆధ్వర్యంలోఆందోళన చేపట్టారు. మేళ్లచెర్వులో బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. చట్టబద్ధంగానే బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, అప్పటి వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాజపేటలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు.
ఫ్లకార్డులతో నిరసన తెలుపుతూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. వలిగొండ మండల కేంద్రంలోనూ బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ తీరుతో పాటు రిజర్వేషన్లను వ్యతిరేకించే వారిపై ఆగ్రహంతో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో చిట్యాల- భువనగిరి రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది. మోత్కూర్లోనూ బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తీరు మార్చుకుని బీసీ రిజర్వేషన్లపై చిత్తుశుద్ధితో కృషి చేయకపోతే తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. పలుచోట్ల ఇంకా బీసీ సంఘాల ఆందోళనలు కొనసాగాయి. శనివారం హైదరాబాద్‌లో బీసీ సంఘాల సమావేశం అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు నేతలు ప్రకటించారు.
బీసీ సంఘాల ఆందోళన నేపథ్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంతో పాటు పలు పట్టణాల్లోని ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడ్డాయి. బీసీ సంఘాల పిలుపు మేరకు ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలే స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. నల్లగొండలోని ప్రైవేటు కాలేజీలతో పాటు పాఠశాలలన్నీ మూతపడ్డాయి. అనంతరం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. క్లాక్ టవర్ వద్ద ఆందోళన నిర్వహిస్తూ బీసీ రిజర్వేషన్లకు ఆటంకం కలిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించే వరకు తమ పోరాటం ఆగదని బీసీ విద్యార్థి సంఘం నేత ఐతగోని జనార్ధన్‌గౌడ్ స్పష్టం చేశారు.
నకిరేకల్, అక్టోబర్ 10: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే దురదృష్టకరం. బీసీ రిజర్వేషన్ లేని ఎన్నికలు మాకొద్దు. బీసీల న్యాయబద్ధమైన హక్కులు సిద్ధించినప్పుడే ఎన్నికలకు వెళ్లాలి. అప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లును వెంటనే ఆమోదించడానికి ఆదేశాలు జారీ చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచే విధంగా కార్యాచరణ మొదలుపెట్టాలి. గవర్నర్ ఆమోదం ఒక్కటే సరిపోదు. బిల్లును 9వ షెడ్యూల్లో పెట్టి ఆమోదించాది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఒత్తిడి పెంచుతూ ఉద్యమ కార్యాచరణ సాగాలి.
– ఆరూరి వెంకటేశ్వర్లు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
సూర్యాపేట, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అంటేనే మోసం చేయడంలో దిట్ట. వంచించడంలో అగ్రస్థానం. ఏమార్చడంలో ఆ పార్టీ వారిని మించినవారు లేరు. ఈసారీ కాంగ్రెస్ బీసీలను మోసం చేసింది. ఎన్నికల ముందు ఆరు గ్యారంటీల పేరిట ఓట్లు వేయించుకొని కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది. బీసీ రిజర్వేషన్ల విషయం కోర్టులో నిలవదని సాధారణ పౌరులకూ తెలుసు. బీసీలకు ఏదో చేసినట్లు నాటకాలాడి ఏమాత్రం నిజాయితీ లేకుండా జీవో తీసి మోసం చేశారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లినవారిని విత్‌డ్రా చేయించే ప్రయత్నం కాంగ్రెస్ చేయలేదు. అసలు రెడ్డి జాగృతికి ప్రధాన పోషకులు రేవంత్‌రెడ్డే. ఆయన ప్రోద్బలంతోనే కోర్టులో కేసులు వేశారు. ప్రజలు అన్నీ చూస్తున్నారు. నూటికి నూరుపాళ్లు బీసీల వెనుక బీఆర్ఎస్ ఉంటుంది.
– బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సూర్యాపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్లు