జిల్లాలోని మోత్కూరు, గుండాల, అడ్డగూడూరు మండలాలకు బిక్కేరు వాగు జీవనాధారం. ఈ ప్రాంతంలో సాగు నీటి ప్రాజెక్టులు లేవు. ఈ మూడు మండలాల్లోని గ్రామాల గుండా వెళ్తున్న బిక్కేరు వాగులోనే వందలాది మంది రైతులు ఇసుకలో చేతి బోర్లు వేసుకొని పంపుసెట్లు బిగించుకొని వందలాది ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. రైతులు వాగులో పక్క పక్కనే రెండు, మూడు చేతి బోర్లు వేసుకున్నా బిక్కేరు వాగు నీరందిస్తుంది. వానకాలం బిక్కేరు వెంట ఉన్న పంట పొలాలు ఎండి పోతుండటంతో రైతుల ఒత్తిడి మేరకు నీటి పారుదల శాఖ అధికారులు గంధమల్ల రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలు విడుదల చేశారు.
ప్రస్తుత యాసంగిలోనూ వరి సాగు చేసిన బిక్కేరు పరీవాహక ప్రాంత రైతులకు సాగునీటి ఇబ్బందులు ఇప్పుడు తప్పడం లేదు. నెల రోజుల కింద గంధమల్ల రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలు విడుదల చేయడంతో ఆలేరు నియోజకవర్గంలోని అంబాల వరకు వచ్చి ఆగి పోయాయి. మోత్కూరు, గుండాల, అడ్డగూడూరు మండలాల్లో చెరువులు, కుంటలు నిండక బోరు, బావుల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. దాంతో బోర్లు పోయక పంటలు ఎండిపోయే దశకు వచ్చాయి.
వానకాలం ఇబ్బందుల నేపథ్యంలో ఈ యాసంగిలో బోర్లు, బావుల కింద రైతులు చాలా తక్కువగా సాగు చేశారు. గతంలో ఐదారు ఎకరాలు నాటు పెట్టిన వారు ఇప్పుడు ఒకటి రెండు ఎకరాలకే పరిమితమయ్యారు. ఫిబ్రవరి నెలలోనే ఎండలు మండి పోవడంతో బిక్కేరు వాగులో నీరు అడుగంటి పోయింది. పంపు సెట్లకు తగినంత నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరి పంటకు ఇంకా నెలన్నర పాటు నీళ్లు పారాలి. యాసంగిలో కూడా బిక్కేరు వాగు దిగువ వరకు గోదావరి నీళ్లు వదలితే బోరు, బావుల్లో నీటి మట్టం పెరిగి పంట చేతికి వచ్చే అవకాశం ఉంటుందని రైతులు చెబుతున్నారు.
బీఆర్ఎస్ హయాంలో రెండు పంటలకు నీళ్లు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గంధమల్ల రిజర్వాయర్ నుంచి బిక్కేరు వాగుకు గోదావరి జలాలు విడుదల చేయడంతో రెండు పంటలకు సాగు నీరు పుష్కలంగా లభించేది. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో పొట్ట దశకు వచ్చిన వరి పొలాలు ఎండి పోతున్నాయి. ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వక పోయినా, తాము బయట అప్పులు తెచ్చి పంటలను సాగు చేస్తే ఇప్పుడు సాగు నీరందక పంటలు ఎండి పోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
నీళ్లు విడుదల చేయాలని రైతుల ఆందోళన
జిల్లాలోని గంధమల్ల రిజర్వాయర్ నుంచి బిక్కేరు వాగులోకి గోదావరి జలాలను దిగువకు వచ్చే వరకూ విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు బిక్కేరు వాగు గుండా సాగు నీరందిస్తే సుమారు నలభై, యాభై గ్రామాల రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం ఆలేరు నియోజకవర్గంలోని అంబాల శివారు వరకు గోదావరి జలాల రాగానే నిలిపి వేశారు. దీంతో మోత్కూరు, అడ్డగూడూరు మండలంతోపాటు గుండాల మండలంలోని పెద్ద పడిశాల గ్రామాల చివరి వరకు గోదావరి జలాలు రావడం లేదు. ఈ మేరకు సోమవారం మోత్కూరు మండలంలోని సదర్షాపురం-గుండాల మండలంలోని పెద్ద పడిశాలకు చెందిన రైతులు పెద్దఎత్తున్న బిక్కేరు వాగులోకి వచ్చి ఆందోళన చేశారు. గోదావరి జలాలను చివరి గ్రామాలకు వచ్చే వరకూ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పశువులకు మేతగా వరి పంట
ఆత్మకూర్.ఎస్, ఫిబ్రవరి 10 : కాళేశ్వరం జలాలు రాకపోవడంతో ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలోని వరి పొలాలు ఎండిపోతున్నాయి. యాసంగిలో వేసిన పంటలు పొట్ట దశకు వస్తుండగా సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని నంద్యాలవారిగూడెం, గట్టికల్లు, ఇస్తాలాపురం, మొక్కుడుదేవులపల్లి, రామన్నగూడెం, శెట్టిగూడెం, రామోజీతండా, తుమ్మల పెన్పహాడ్, తెట్టేకుంట తండాల్లో వందల ఎకరాల్లో పంటలు నీళ్లు లేక దెబ్బతింటున్నాయి. రామోజీతండాలో సుమారు 25ఎకరాల పంట ఎండిపోయింది. దాంతో చేసేదేమీ లేక రైతులు వరి పైరును పశువులకు మేతగా వదిలేస్తున్నారు. పూర్తి స్థాయిలో గోదావరి జలాలు విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.
గోదావరి జలాలు వదిలి వరి పంటలను కాపాడాలి
బిక్కేరు వాగులో జలాలు అడగంటి పోవడంతో బోర్లు పోయడం లేదు. వాగులోని నీళ్ల మీద ఆధార పడి వరి సాగు చేశాం. ఇప్పుడు రోజు రోజుకు ఎండలు పెరిగి పోయి బోర్లు అడుగంటి పోయినయి. నీళ్లు లేక పొలాలు ఎండి పోతున్నాయి. పొట్టకొచ్చిన పంట పొలాలు ఎండి పోకుండా గోదావరి జలాలను బిక్కేరు వాగులోకి విడుదల చేసి రైతులను ఆదుకోవాలి.
-దొండ నర్సయ్య, రైతు, సదర్షాపురం, మోత్కూరు