కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అటకెక్కుతుండడంతో రేవంత్‌రెడ్డి సర్కారుపై క్రమంగా భ్రమలు తొలిగిపోతున్నాయి. దాంతో ఆయా వర్గాలన్నీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన బాట పడుతున్నాయి. అధికారం చేపట్టి ఏడాది పాలన పూర్తి చేసుకున్నా నేటికీ తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడుతున్నాయి. ఇప్పటికే అనేక వేదికలపై ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, అధికారులకు తమ సమస్యల పరిష్కారం కోసం విన్నవించి అలిసిపోయాయి. ఇక గత్యంతరం లేక రోజుకో వర్గం ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేస్తూ పోరుబాట పడుతున్నాయి. ఇప్పటికే విద్యాశాఖ సమగ్ర శిక్షా ఉద్యోగులు 24రోజులుగా విధులు బహిష్కరించి సమ్మెలో ఉంటున్నారు. వారి ఆందోళనతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. మరోవైపు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు సైతం దశల వారీ ఆందోళనల అనంతరం సమ్మె నోటీసు ఇచ్చి పోరుబాటలో ఉన్నారు. తాజాగా గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె బాట పట్టారు. పెండింగ్ వేతనాలతోపాటు మల్టీపర్సస్ విధానం రద్దు తదితర డిమాండ్లతో 4 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమయ్యారు. ఇక జిల్లా పరిధిలోని సివిల్ సప్లయ్ హామీలు తమ కూలీ రేట్లను సవరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. ఇలా వివిధ వర్గాలు ఆందోళన బాట పట్టడంతో ఆయా శాఖల్లో విధులకు తీవ్ర ఆటంకం కలుగుతున్నది. విద్యార్థుల చదువులు, గ్రామాల్లో పారిశుధ్య పనులు గాలికి వదిలేసిన పరిస్థితులు నెలకొన్నాయి.
– నల్లగొండ ప్రతినిధి, జనవరి 2 (నమస్తే తెలంగాణ)
మోడల్ స్కూల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నారు. కాం గ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా స్పందన కరువవడంతో డిమాండ్ల సాధన కోసం విద్యాశాఖ కమిషనర్, మోడల్ స్కూల్ డిప్యూటీ డైరెక్టర్‌కు నవంబర్ 22న ఒకసారి, డిసెంబర్ 10 మరోసారి వేర్వేరుగా ప్రోగ్రెసిస్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(పీఎంటీఏ-టీఎస్) ఆధ్వర్యంలో సమ్మె నోటీసులు అందజేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ దశల వారీ ఆందోళనలకు సిద్ధమయ్యారు. గత డిసెంబర్ 12 నుంచి వీరి ఆం దోళన కొనసాగుతున్నది. ఈ నెల 4న మహాధర్నాకు సిద్ధ్దమయ్యారు.
విద్యా శాఖ సమగ్ర శిక్షా ఉద్యోగులు 2023 సెప్టెంబర్ 13న తమ డిమాండ్ల కోసం దీక్షలు చేస్తుండగా అప్పటీ టీపీసీపీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్‌లోని దీక్ష శిబిరం వద్దకు వెల్లి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. అధికారంలోకి రాగానే చాయ్ తాగినంత సమయంలో మీ సమస్యలు పరిష్కారించడంతోపాటు రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఇచ్చిన హామీలపై ఏడాది కాలంగా ఎదురుచూసిన సమగ్ర శిక్షా ఉద్యోగులు ఓపిక నశించి పోరు బాట పట్టారు. విధులను బహిష్కరించి 24 రోజులుగా సమ్మె చేస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి, ఎమ్మెల్యేలు, అధికారులకు తమ గోడు విన్నవించుకున్నా. నేటీకి ప్రభుత్వం స్పందించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ సమగ్రశిక్షా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 15 రోజులు మందుగానే ప్రభుత్వానికి, విద్యాశాఖకు సమ్మె నోటీసు అందజేశారు. స్పందించకపోవడంతో అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద డిసెంబర్ 10 నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. కలెక్టరేట్ల వద్ద దీక్షా శిబిరం ఏర్పాటు చేసుకుని రోజుకో విధంగా నిరసన తెలుపుతున్నారు. గురువారంతో వారి సమ్మె 24వ రోజుకు చేరింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీఆర్పీలు, కేజీబీవీ, యూఆర్ఎస్, ఎమ్మార్సీలు, భవత సెంటర్లు, సమగ్ర శిక్షా జిల్లా విద్యా కార్యాలయంలో వివిధ హోదాల్లో పని చేస్తున్న 2,198మంది సమ్మెలో ఉన్నారు. ఫలితంగా కేజీబీవీ, యూఆర్ఎస్లో బోధన సాగడం లేదు. ఆయా సెంటర్లు, స్కూల్ కాంప్లెక్స్‌లో విద్యాశాఖ కార్యక్రమాల నిర్వహణ కుంటుపడడంతో అధికారులు, ఉపాధ్యాయులు అవస్థ పడుతున్నారు.
ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ బియ్యం గోదాములలో పని చేస్తున్న హమాలీలు కూడా డిమాండ్ల సాధన కోసం ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం యూనియన్లతో చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని, రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే సివిల్ సప్లయ్ రేట్ల ఒప్పందం వెంటనే జరుపాలన్నవి వీరి ప్రధాన డిమాండ్లు. హమాలీల సమస్యలపై గత అక్టోబర్‌లో పలు దఫాల ఆందోళన అనంతరం సివిల్ సప్లయ్ అధికారులు యూనియన్ నాయకులతో చర్చించారు. ఒప్పందం ప్రకారం పెంచిన రేట్లపై నేటికీ జీఓ విడదుల చేయలేదు. కొత్త రేట్లు అమలుకు నోచకపోవడంతో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో హామాలీలు సమ్మె బాట పట్టారు. రెండు రోజులుగా నిరవధిక సమ్మె చేపడుతున్నారు. దాంతో ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ప్రభుత్వం తక్షణమే తమ డిమాండ్ల పరిష్కరించాలని హమాలీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
తమ సమస్యల పరిష్కారం కోసం గ్రామపంచాయతీ కార్మికులు పోరుబాట పట్టారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నారు. గత నెల 6న జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధ్దమని ప్రకటించారు. అయినా సర్కారు స్పందించకపోవడంతో దశల వారీ ఆందోళనలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే రెండు రోజుల పాటు విధుల బహిష్కరించి టోకెన్ సమ్మె నిర్వహించారు. అయినా ఫలితం లేకపోవడంతో ఈ నెల 4 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. 2023 జూలైలో గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతు తెలుపుతూ అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించింది. కానీ ఏడాది పాలన పూర్తయినా పట్టించుకోకపోవడంతో పంచాయతీ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. వీరు సమ్మెలోకి వెళ్తే గ్రామాల్లో పారిశుధ్యం, మంచినీటి సరఫరా, వీధిలైట్ల నిర్వహణ, డంపింగ్ యార్డులు, హరితహారం, పల్లె ప్రకృతి వనాల నిర్వహణ, చెత్త సేకరణ వంటి పనులన్నీ నిలిచిపోనున్నాయి. ఇప్పటికే పంచాయతీ పాలక వర్గాలు లేక పల్లెలు అస్తవ్యస్తంగా మారాయి. కార్మికుల సమ్మెతో మరింత ఇబ్బందికర పరిస్థితులు తప్పేలా లేవు.