నల్లగొండ ప్రతినిధి, మే 14 (నమస్తే తెలంగాణ) : గెలిచేదెవరు? ఓడేదెవరు? పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు ఫలితాల పైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో ఎంపీలుగా ఎవరు గెలుస్తారనే అంశంపైనే జిల్లా వాసులు ప్రధానంగా చర్చించుకుంటున్నారు.
రాజకీయపార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ఉద్యోగులు, ఇతర రాజకీయ ఆసక్తి ఉన్న వారిలో ఏ ఇద్దరు కలిసినా ప్రస్తుతం చర్చంతా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపైనే కనిపిస్తున్నది. ఇక్కడి ఎంపీ ఎన్నికలతోపాటు పక్క రాష్ట్రంలో గెలిచేదెవరు? అన్న ప్రశ్నల చుట్టే చర్చలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు, 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత పోలింగ్లో కొంత హెచ్చుతగ్గులు ఉండగా అది ఎవరికి లాభిస్తుంది? ఎవరికి నష్టం చేస్తుందన్నది చర్చనీయాంశమైంది
నల్లగొండ ఎంపీగా ఎవరు గెలుస్తారు? భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి ఏ అభ్యర్థి గెలువబోతున్నారు? ఈ రెండు ప్రశ్నలు మాత్రమే కాదు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది? ఫలానా స్థానంలో ఫలానా అభ్యర్థి గెలిచే అవకాశం ఉందంట కదా? పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి ఎవరు వస్తారు? ఎవరికి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుంది? ఇలా ఉమ్మడి జిల్లా అంతటా ఏ ఇద్దరిని కదిలించినా ఇలాంటి చర్చలే కనిపిస్తున్నాయి. పార్లమెంట్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో జిల్లాలో ఎవరు గెలువనున్నారనే అంశంతోపాటు.. పక్క రాష్ట్రం, జాతీయ రాజకీయాల పైనా విస్తృత చర్చ కొనసాగుతున్నది.
లోక్సభ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలన్నీ శాసనమండలి పట్టభధ్రుల నియోజకవర్గం ఉప ఎన్నికలపై దృష్టి సారించారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అభ్యర్థుల తుది జాబితా వెల్లడైంది. దాంతో అందరూ ప్రచారంపైనే కేంద్రీకరించనున్నారు. బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్రెడ్డి, కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న), బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులుగా బరిలో ఉండగా వీరితోపాటు మరో 49 మంది కూడా పోటీలో ఉన్నారు. ఈ నెల 27న పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో 25న సాయంత్రం 4 గంటల వరకే ప్రచారానికి గడువు మిగిలి ఉంది. దాంతో మండలి ఉప ఎన్నికల ప్రచారం ఇక నుంచి హోరెత్తనుంది.
నల్లగొండ పార్లమెంట్ స్థానంలో మొత్తం 17,25,465 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 74.02 శాతం.. భువనగిరి పార్లమెంట్ స్థానం పరిధిలో మొత్తం 18,08, 585 మంది ఓటర్లకు 76.78 శాతం ఓట్లు పోలయ్యాయి. ఓట్ల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు ఆయా పార్టీల అభ్యర్థులు, ముమ్మర ప్రచారం సాగించిన నేతలు.. గెలిచేదెవరు? అన్న అంశం పై ఆరా తీస్తున్నారు.
పోలింగ్ బూత్ల వారీగా తమకు అనుకూలంగా పోలైన ఓట్ల అంచనాలు వేస్తున్నారు. ఏయే ప్రాంతాల్లో తమకు అత్యధిక మెజారిటీ దక్కుతుందనే అంశంపై ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన బాధ్యులు లెక్కలు వేస్తున్నారు. ఎక్కడెక్కడ ఎక్కువ ఓట్లు వస్తే తమ గెలుపునకు అవకాశం ఉంటుందనే అంచనాల్లో బీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్, బీజేపీ నేతలు మునిగిపోయారు. ఫోన్లలో ఆరా తీస్తూ, కాగితాలపై రాస్తూ ప్రతి ఒక్కరూ ఆయా స్థాయిల్లో ప్రస్తుతం ఈ లెక్కల్లోనే మునిగి తేలుతున్నారు.
2007 నుంచి వరుసగా నాలుగుసార్లు జరిగిన గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్సే ఇక్కడ విజయం సాధిస్తూ వచ్చింది. ప్రస్తుత ఉప ఎన్నికల్లో మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ ఉంది. అందుకే బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార సరళి తదితర అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశం అనంతరం బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఉప ఎన్నికల కదనరంగంలోకి దూకనుంది.