యాదాద్రి భువనగిరి, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : ట్రిపుల్ ఆర్ భూసేకరణలో అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో బీఆర్ఎస్ సీనియర్ నేత కర్రె వెంకటయ్యతో పాటు మరికొందరు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 438లో కురుమ కులస్తులకు చెందిన సుమారు 250 ఎకరాల్లో 15 ఏళ్ల క్రితమే టీ వెంచర్‌ను ఏర్పాటు చేసి ప్లాట్లు సైతం విక్రయించారు.
ఇదే భూమిలో ప్రస్తుత గ్రామ సర్పంచ్ మంగ సత్యనారాయణ కుటుంబ సభ్యులకు చెందిన భూమిని సైతం టీ వెంచర్‌కు డాక్యుమెంట్ నంబర్లు 6668/2014, 10292/2015, 8612/2014, 14318/ 2014, 10288/2015, 11324/2018, 10289/2015 ద్వారా విక్రయించారు. ఈ భూమికి గతంలో ఎలాంటి పట్టాదారు పాసుపుస్తకాలు లేవు. గతంలో భువనగిరి ఆర్డీవోగా పనిచేసిన కిష్టప్ప కురుమ కులస్తులకు జీవో నంబర్ 38 ద్వారా పట్టా హకు కల్పించారు. ఈ పట్టాలను సవాల్ చేస్తూ ఓ నవాబు కుటుంబ సభ్యులు హైకోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉన్నది.
అంతే కాకుండా టీ వెంచర్ లేఔట్ చేసిన సమయంలో 438 సర్వే నంబరులోని 10 ఎకరాలను మల్లాపురం గ్రామ పంచాయతీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. వాస్తవానికి గ్రామ పంచాయతికి కేటాయించిన 10 ఎకరాల స్థలంలోనే ట్రిపుల్ ఆర్ నిర్మాణం జరుగుతున్నది. ట్రిపుల్ ఆర్ నిర్మాణం నేపథ్యంలో మల్లాపురం సర్పంచ్ మంగ సత్యనారాయణ కుటుంబ సభ్యుల స్థలం నుంచి రోడ్డు వెళ్తున్నది. దీంతో యాదగిరిగుట్ట తాసీల్దార్‌కు రూ.20 లక్షలు ఇచ్చి తప్పుడు నివేదికను సమర్పించారని ఫిర్యాదులో పేరొన్నారు.
టీ వెంచర్ పంచాయతీ లేఔట్ కావడంతో గతంలో విక్రయించిన రైతుల పేర్లు రెవెన్యూ రికార్డులో తొలగించకపోవడంతో తిరిగి అదే రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు రావడంతో ఇబ్బందులు వస్తున్నాయి. టీ వెంచర్ యాజమాన్యం, మంగ సత్యనారాయణ కుటుంబం కుమ్మక్కయి ప్లాట్లను కొనుగోలు చేసిన కష్టమర్లను మోసగిస్తున్నారు. ఇదే విషయమై స్వయంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇంట్లోనే ఒప్పందం కుదుర్చుకున్నారు. వచ్చిన దాంట్లో ఎమ్మెల్యేకు సగం.. సర్పంచ్ మంగ సత్యనారాయణ కుటుంబ సభ్యులకు సగం వాటా పంచుకున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి ప్లాట్లు కొనుగోలు చేసిన కష్టమర్లకు న్యాయం చేయాలని కర్రె వెంకటయ్య కోరారు.