పటాన్చెరు టౌన్, జూలై 31: హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శుక్రవారం అచీవర్స్ డే-2026 నిర్వహించారు. వృత్తి మార్గదర్శన కేంద్రం(సీజీసీ) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రాంగణ నియామకాల ద్వారా ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను సత్కరించి నియామక పత్రాలు, కెరీర్ ఫుల్ఫిల్మెంట్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా 2026 గ్రాడ్యుయేట్ బ్యాచ్‌కు సంబంధించిన ప్రాంగణ నియామక ఫలితాలను విశ్వవిద్యాలయం ప్రకటించింది. జూలై 2026 నాటికి ప్రాంగణ నియామకాలు ఎంచుకున్న 1,347 మంది విద్యార్థుల్లో 771 మంది ఉద్యోగాలు సాధించారు.
విశ్వవిద్యాలయంలోని ఏడు స్కూళ్లకు చెందిన విద్యార్థులకు 324 ప్రముఖ సంస్థలు వెయ్యికి పైగా ఉద్యోగావకాశాలు కల్పించాయి. గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ 97.5 శాతం ప్లేస్మెంట్ రేటుతో అగ్రస్థానంలో నిలవగా, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 100శాతం, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 95.8శాతం ప్లేస్మెంట్లు నమోదయ్యాయి. గీతం స్కూల్ ఆఫ్ అర్కిటెక్చర్ 100శాతం ప్లేస్మెంట్లు సాధించింది. గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విద్యార్థులకు అత్యధికంగా 544 ఉద్యోగ ఆఫర్లు లభించగా, 443 మంది విద్యార్థులు ప్రాంగణ నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందారు.
ఈ సీజన్లో గరిష్ఠంగా రూ.16లక్షల వార్షిక వేతన ప్యాకేజీ లభించింది. కార్యక్రమానికి పీడబ్ల్యూసీ ఏసీ డైరెక్టర్ అండ్ చీఫ్ ఆపరేషన్స్ లీడర్(టాక్స్) జీటీ కృష్ణ చైతన్య, టీసీఎస్ ప్రాంతీయ అధిపతి రిజర్డ్ కింగ్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులను అభినందించారు. నిరంతర అభ్యాసం, ఆవిష్కరణ, వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు మాట్లాడుతూ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో గీతం ముందంజలో ఉందన్నారు. ప్లేస్మెంట్ సాధించిన విద్యార్థులు తమ అనుభవాలు పంచుకోగా తల్లిదండ్రులు, అధ్యాపకులు, విభాగాధిపతులు, విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.